Paksitan vs England : సొంతగడ్డపై వరుసగా 14 టెస్టులు ఓడిన పాకిస్థాన్ (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ ముల్తాన్‌లో రెండో టెస్టు కోసం భారీ మార్పులు చేసింది. ఇప్పటికే మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం, ప్రధాన పేసర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షాలను సెలెక్టర్లు పక్కనపెట్టేశారు. సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అంతేకాదు యువకెరటం కమ్రాన్ ఘలామ్ (Kamran Ghulam)ను జట్టులోకి తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణిస్తున్న కమ్రాన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయంగా టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన పాక్.. ముల్తాన్‌లో విజయంపై గురి పెట్టింది. అందుకు తగ్గట్టే ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను తీసుకుంది. నొమాన్ అలీ, సాజిద్ ఖాన్‌లతో పాటు మణికట్టు మాంత్రికుడు జహిద్ మహమూద్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. చూస్తుంటే.. రెండో మ్యాచ్ కోసం పాక్ టర్నింగ్ పిచ్ తయారు చేసినట్టు తెలుస్తోంది.
Four changes for Pakistan, including a debut for Kamran Ghulam 😲 pic.twitter.com/sOwwqqsTFA
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2024
పాకిస్థాన్ తుది జట్టు : సయూం ఆయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్(కెప్టెన్), కమ్రాన్ ఘులామ్, సాద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, అమర్ జమాల్, నొమాన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మహ్మద్.
స్వదేశంలో గొప్ప రికార్డులు కలిగిన పాకిస్థాన్ ఇప్పుడు చిన్న జట్లకూ తల వంచుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఆ దారుణ పరాభవాన్ని మరువకముందే ఇంగ్లండ్ చేతిలో ఓటమి. ముల్తాన్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా కొట్టిన పాక్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. దాంతో, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 15, మంగళవారం రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది.