మెల్బోర్న్: సొంతగడ్డపై ఆస్ట్రేలియా అదరగొట్టింది. వరుసగా రెండో టెస్టులోనూ పాకిస్థాన్‌ను చిత్తుచేసిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 317 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ కంగారూ పేసర్ల ధాటికి 237 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ షాన్ మసూద్ (60), సల్మాన్ (50) అర్ధశతకాలు సాధించగా.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (41), రిజ్వాన్ (35) కాస్త పోరాడారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5, స్టార్క్ 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 264 రన్స్‌కు పరిమితమైంది. కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.