Pakistan : టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ పాకిస్థాన్(Pakistan) ప్రస్థానం ముగిసింది. అనిశ్చితికి మారుపేరైన పాక్ తొమ్మిదో సీజన్లో అనామక జట్టును తలపించింది.పసికూన అమెరికా (USA) చేతిలో.. ఆ తర్వాత భారత జట్టుపై ఓడిన బాబర్ ఆజాం (Babar Azam) బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాయాది జట్టు ఘోర వైఫల్యంపై పాక్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్ (Wasim Akram), వకార్ యూనిస్‌లు అయితే.. జట్టులో సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబర్ టీమ్‌లో మూడు గ్రూప్‌లు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
‘ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో గ్రూప్ రాజకీయం నడుస్తోంది. టీమ్‌లో మూడు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి బాబర్ ఆజాం నాయకుడు కాగా.. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan), స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రిది (Shaheen Afridi)లు తలొక గ్రూప్ నడిపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు పేసర్ మహ్మద్ అమిర్, ఇమాద్ వసీంలు స్క్వాడ్‌కి ఎంపికవ్వడం పాక్ జట్టు పతనానికి కారణమైంది’ అని పీసీబీ(PCB) వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అందుకనే కాబోలూ మైదానంలో పాక్ ఆటగాళ్లు సమిష్టిగా ఆడినట్టు అనిపించలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడం వల్ల మరో మ్యాచ్ ఉండగానే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో వైఫల్యం నుంచి పాక్ జట్టులో పలు మార్పులు జరిగాయి. కెప్టెన్‌గా బాబర్‌ను తప్పించిన సెలెక్టర్లు షాహీన్ ఆఫ్రిదికి పగ్గాలు అప్పగించారు. కానీ, తొలి పరీక్షలో అయిన న్యూజిలాండ్ (Newzealand) సిరీస్‌లో ఆఫ్రిదికి జీరో మార్కులు వచ్చాయి. దాంతో, టీ20 వరల్డ్ కప్ ముందు పీసీబీ మళ్లీ బాబర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దాంతో, కెప్టెన్సీ పోయిందనే బాధలో ఆఫ్రిది.. వైస్ కెప్టెన్ నుంచి సారథిగా ప్రమోట్ అవ్వాలనుకున్న రిజ్వాన్‌లు అసంతృప్తితో రగిలిపోయిన విషయం తెలిసిందే.
The 2022 runners-up have had a campaign to forget https://t.co/4jZKMnBHcX #T20WorldCup pic.twitter.com/wBqhIAI5ia
— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2024
పొట్టి ప్రపంచ కప్ తొలి సీజన్ రన్నరప్ అయిన పాక్.. 2009లో ట్రోఫీ గెలిచింది. అనంతరం కనీసం సెమీస్ చేరిన పాక్.. 2022లో మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ, ఈసారి మాత్రం బాబర్ సేన ఏమాత్రం పోరాడకుండానే టోర్నీ నుంచి వైదొలగడం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తొలి మ్యాచ్‌లో అమెరికా బౌలర్ల ధాటికి సూపర్ ఓవర్ ఆడిన పాక్ 5 పరుగులతో ఓడిపోయింది.
ఇక చిరకాల ప్రత్యర్థి భారత్‌పై అందివచ్చిన విజయాన్ని బాబర్ సేన చేజేతులా వదిలేసింది. బుమ్రా(3/14), పాండ్యా (2/24)ల విజృంభణతో స్వల్ప ఛేదనలో చతికిలబడి తన పరాజయాల పరంపరను కొనసాగించింది. సూపర్ 8 ఆశలు మిణుకుమిణుకు మంటున్న వేళ కెనడా, ఐర్లాండ్ మ్యాచ్‌పై పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఆ పోరు కాస్త వాన కారణంగా రద్దు కావడంతో అమెరికా సూపర్ 8కు వెళ్లగా.. పాకిస్థాన్ ఎలిమినేట్ అయింది. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో బాబర్ బృందం జూన్ 16 ఆదివారం నాడు ఐర్లాండ్‌తో తలపడనుంది.