White Bread Vs Brown Bread | మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో బ్రెడ్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా దీనిని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. చాలా మంది ఉదయం పూట టీ తో దీనిని తీసుకుంటూ ఉంటారు. అలాగే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడేటప్పుడు కూడా సులభంగా జీర్ణమవుతుందని బ్రెడ్ ను పాలతో తీసుకుంటూ ఉంటారు. అలాగే శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ జామ్ ఇలా వివిధ రకాలుగా కూడా బ్రెడ్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. ఈ బ్రెడ్ మనకు మార్కెట్ లో వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటుంది. మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేవి వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. ఈ రెండు రకాల బ్రెడ్ ల మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ లలో ఏది మంచిది.. దేనిని తీసుకోవాలి.. అని ప్రజలకు ఎప్పుడూ సందేహం ఉంటుంది. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు స్పష్టతను ఇచ్చారు.
వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదని వారు చెబుతున్నారు. గోధుమలు, హోల్ గ్రెయిన్స్ తో చేసిన బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ కేవలం రంగును చూసి మాత్రమే ఆరోగ్యానికి మంచిదని భావించకూడదు. మార్కెట్ లో బ్రౌన్ బ్రెడ్ అని నకిలీ బ్రెడ్ లను కూడా అమ్ముతూ ఉంటారు. కనుక బ్రౌన్ బ్రెడ్ ను కొనుగోలు చేసేటప్పుడు కూడా వివిధ అంశాలను గుర్తించుకుని కొనుగోలు చేయాలని వారు చెబుతున్నారు. వైట్ బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇక బ్రౌన్ బ్రెడ్ గోధుమ రంగులో కనబడడానికి కారామెల్ రంగును వాడుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన బ్రెడ్ మంచిది కాదు. కనుక బ్రౌన్ బ్రెడ్ ను కొనుగోలు చేసేటప్పుడు 100 శాతం గోధుమలతో, తృణ ధాన్యాలతో చేసిన బ్రెడ్ ను చూసి మాత్రమే కొనుగోలు చేయాలి.
గోధుమలతో, హోల్ గ్రెయిన్ లతో చేసిన బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగుల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. పేగులల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యానికి ఇవి మద్దతును ఇస్తాయి. కనుక వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడమే మంచిది. ఇక బ్రౌన్ బ్రెడ్ ను తయారు చేసే కంపెనీలు మార్కెటింగ్ కోసం ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. రంగులతో చేసే బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. 100 శాతం గోధుమలతో చేసిన బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, బ్రెడ్ ను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.