హైదరాబాద్, ఆట ప్రతినిధి: వన్డే ప్రపంచకప్ ఆడేందుకు దాయాది పాకిస్థాన్ జట్టు.. భారత్లో అడుగుపెట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ టీమ్ ఇక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్ బృందం లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్లో అడుగుపెట్టింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడకుండా.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతునున్నాయి. ప్రయాణానికి 48 గంటల ముందు పాక్ ప్లేయర్లకు భారత వీసా లభించగా.. తాజా జట్టులో మహమ్మద్ నవాజ్, సల్మాన్ అలీ తప్ప మిగిలిన వాళ్లందరికీ ఇదే తొలి భారత పర్యటన. ప్రతిష్ఠాత్మక వరల్డ్కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. అందులో తొలి మ్యాచ్ శుక్రవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్తో జరగనుంది.