PAK vs BAN : సొంతగడ్డపై టెస్టుల్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న పాకిస్థాన్(Pakistan)కు భారీ షాక్. రావల్పిండిలో జరగనున్న రెండో టెస్టులో విజయంపై కన్నేసిన ఆ జట్టుకు వరుణుడు ఝలక్ ఇచ్చాడు. ఆగస్టు 29 గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వాన శుక్రవారం(ఆగస్టు 30) నాడు కూడా వదల్లేదు. టాస్ వేసే అవకాశం ఇవ్వని వరుణుడు శాంతిస్తే ఒట్టు.
లంచ్ టైమ్ అయినా రావల్పిండిలో చినకులు తగ్గలేదు. దాంతో, స్టేడియమంతా నీటితో నిండిపోయింది. ఇక వాన తగ్గినా కూడా ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు చాలా సమయం పడుతుంది. అందకని అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి తొల రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆగస్టు 31, శనివారం వాన లేకుంటే యథావిధిగా ఉదయం 10 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది.
The opening day of the second #PAKvBAN Test has been washed out!https://t.co/XC83cZ62Mi pic.twitter.com/lkSJjzZupk
— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2024
ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ 7వ, పాకిస్థాన్ 9వ స్థానంలో కొనసాగుతున్నాయి. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన బంగ్లా.. 2-0తో సిరీస్ గెలిస్తే డబ్ల్యూటీసీలో ముందుకెళ్తుంది. స్వదేశంలో ఇప్పటికే ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ సిరీస్ సమం చేసి పరవు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది.
స్వదేశంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లా.. పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్(171), సాద్ షకీల్(124)లు సెంచరీలతో చెలరేగినా.. రెండో ఇన్నింగ్స్‌లో అదే తరహాలో ఆడలేకపోయారు.
మరోవైపు.. బంగ్లా సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.