షిల్లాంగ్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) (Trinamool Congress) మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది. ఆ పార్టీ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా ప్రతిపక్ష నాయకుడిగా (ఎల్ఓపీ) గురువారం నియమితులయ్యారు. టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ సంగ్మాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించినట్లు మేఘాలయ అసెంబ్లీ కమిషనర్, కార్యదర్శి ఆండ్రూ సైమన్స్ ఒక నోటిఫికేషన్లో తెలిపారు. మేఘాలయ అసెంబ్లీలో ‘ప్రతిపక్ష చీఫ్ విప్’గా రోనీ వీ లింగ్డోను స్పీకర్ గుర్తించినట్లు పేర్కొన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో టీఎంసీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు.
మరోవైపు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు సభ్యులు అధికార ఎన్పీపీలో చేరారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మేఘాలయ అసెంబ్లీలో మిగిలి ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోనీ వీ లింగ్డో టీఎంసీకి మద్దతిచ్చారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా తమకు ఇవ్వాలని స్సీకర్ థామస్ ఏ సంగ్మాను టీఎంసీ కోరడంతో ఆయన దీనికి అంగీకరించారు.