ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 16: కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్‌లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థితో పాటు పలువురిపైకి కాంగ్రెస్ నేత, సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌తో తొక్కించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంజి భారతిని మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తాతో కలిసి కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా భారతి కుటుంబ సభ్యులు.. కేటీఆర్‌తో తమ ఆందోళన వెలిబుచ్చారు. సర్పంచ్ కుర్మ పాపయ్య తమ్ముడు చిరంజీవులు చంపాలన్న కక్షతోనే ట్రాక్టర్‌తో ఢీకొట్టాడని వాపోయారు. తమకు ప్రాణహాని ఉందని, వారి నుంచి తమను ఆదుకోవాలని కేటీఆర్‌తో మొర పెట్టుకున్నారు. స్పందించిన ఆయన.. అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. ఏమాత్రం అధైర్యపడొద్దని, బాధితులకు వై ద్య ఖర్చులన్నీ పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..
కాంగ్రెస్ దౌర్జన్యాలను అడ్డుకుంటామని, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశారనే అక్కసుతో ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించడం అత్యంత హీనమైన చర్య అని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ పడేదాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బాధితులకు అండగా నిలబడ్డ నాయకులు,, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే తామే డీజీపీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని, అప్పటిదాకా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలన్నారు. మొ దటగా బాధితుల ప్రాణాలు కాపా డే విధంగా దృష్టిపెడదాం, మిగతా కార్యక్రమాలన్నీ తరువాత చూసుకుందామన్నారు.
ప్రజలు తిరగబడతారు..
దాడిలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ శిక్షపడేవరకు వదిలి పెట్టే ప్రసక్తి లేదని, న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గూండాలు ఇష్టమొచ్చినట్లు దాడులకు తెగబడుతుంటే పోలీసులు నిశ్చేష్టులై ఉండడం సరికాదన్నారు. పోలీసులు ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని, దీనివల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. సోమార్పేట్ దాడి ఘటన వెనుక ఉన్న అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ నుంచి కింది స్థాయి పోలీసు వరకు అందరికీ ప్రజల సొమ్ముతోనే జీతాలు వస్తున్నాయని, రేవంత్ ఇంటి సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో పోలీసులకు జీతాలు ఇవ్వడం లేదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే పరామర్శ..
సోమార్పేట్ ఘటనలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతి, ఆమె కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పరామర్శించారు. నిందితులను ఉపేక్షించేది లేదని, వారికి శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.