న్యూఢిల్లీ: అర్జెంటీనా దిగ్గజ ఫుల్బాలర్ మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటన ఆఖరి రోజు ఢిల్లీలో జరిగిన ఒక ఉదంతం భారత్ పరువును అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసింది. అరుజ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. తొలుత మెస్సీని ఉత్సాహపరిచేందుకు అభిమానులు నినాదాలు చేశారు.
అయితే స్టేడియంలోకి బీజేపీ సీఎం రేఖా గుప్తా ప్రవేశించిన వెంటనే ఆ నినాదాలు కాస్తా దేశ రాజధాని ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు నాణ్యతకు వ్యతిరేకంగా మారాయి. దీంతో ప్రేక్షకులు ఏక్యూఐ, ఏక్యూఐ అంటూ నినాదాలు చేయడంతో సీఎం అవమాన భారంతో ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్‌లు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచాయి. ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు క్షీణతను మెరుగుపర్చడంలో అధికార బీజేపీ, మోదీ ప్రభుత్వం ఉదాసీనతను చూపుతున్నదని ఆప్ ఆరోపించింది.
రాజధాని ఢిల్లీలో కాలుష్యం కట్టడిపై అక్కడి ట్రిపుల్ ఇంజిన్ సర్కారు చేతులెత్తేసింది. రోజురోజుకూ దిగజారుతున్న కాలుష్య ప్రమాణాలపై బీజేపీ మంత్రి మంజీందర్ సింగ్ మంగళవారం ప్రజలకు క్షమాపణ చెప్పారు. కాలుష్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన, ఆ తప్పునకు మాత్రం మునుపటి ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేవలం 9,10 నెలల్లో కాలుష్య స్థాయిని తగ్గించడం సాధ్యం కాదన్నారు.
ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో ఇక నుంచి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ)ని చూపిన వాహనదారులకే ఇంధనం నింపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.