న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా దృశ్య గోచరత లేక మంగళవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కాలిన గాయాలతో మరణించగా, 35 మంది గాయపడ్డారు. తెల్లవారుజామను 4.30 గంటలకు కనీసం ఏడు బస్సులు, మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఆగ్రా-నోయిడా వైపు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 127వ మైలు రాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుందని, గాయపడిన వారినందరినీ దవాఖానలకు తరలించినట్టు మథుర సీనియర్ ఎస్పీ శ్లోక్ కుమార్ తెలిపారు. గాయపడిన వారెవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రమాదంలో 13 మంది మరణించారని, ఇద్దరిని గుర్తించామన్నారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తెచ్చామని, మంటల్లో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.