Sunil Gavaskar | ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) జరుగనున్నది. ఐసీసీ (ICC) ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరుగనుండగా.. పాకిస్తాన్, దుబాయి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీమిండియా మ్యాచులన్నీ దుబాయిలో జరునుండగా.. మిగతా మ్యాచులన్నీ పాక్‌లో జరుగనున్నాయి. టోర్నీలో ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీలో ఏ జట్టు గెలుస్తుందో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ జోష్యం (Sunil Gavaskar) చెప్పారు. చాంపియన్స్ ట్రోఫీలో జట్ల మధ్య పోరు ఉంటుందని.. అయితే, పాక్‌కు మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని.. హాట్ ఫేవరేట్ ట్యాగ్‌ను ఆతిథ్య జట్టుకే ఇవ్వాలని టీమిండియా దిగ్గజం పేర్కొన్నారు.
మొహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నది. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన పాకిస్తాన్.. ఇటీవల ఐసీసీ టోర్నీలో ఘోరంగా విఫలమైంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే ఇంటిబాట పట్టింది. అయినా.. పాక్ సొంత గడ్డపై రాణించి టైటిల్ వేటలో ప్రత్యర్ధులను సవాల్ చేయగలదని గవాస్కర్ పేర్కొన్నారు. సొంత గడ్డపై ఏ పరిస్థితుల్లో ఏ జట్టునైనా ఓడించడం అంత సులువైన విషయం కాదన్నారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్ ఓడిపోయిందని.. అంతకు ముందు వరుస మ్యాచుల్లో గెలిచిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశారు. ప్రస్తుతం పాక్‌కు అలాంటి అవకాశాలే ఉన్నాయన్న ఆయన.. అందుకే రాబోయే టోర్నమెంట్లో పాక్ ఫేవరేట్ జట్టుగా నిలుస్తుందని తాను భావిస్తున్నాన్నారు.