Pak Vs ENG | 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు తొలిసారిగా పాక్‌లో పర్యటించనున్నది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (PCB) మంగళవారం ధ్రువీకరించింది. కరాచీ, లాహోర్ వేదికగా మ్యాచ్‌లు జరునున్నాయి. సెప్టెంబర్ 20, 22, 23, 25 మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో, 28, 30, అక్టోబర్ 2 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. అయితే, ఇంగ్లాండ్‌తో టీ20 సిరిస్‌పై పీసీబీ డైరెక్టర్ జాకీర్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.
కరాచీ, లాహోర్ ఏడు టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టోర్నీ నిర్వహించడం ద్వారా సన్నాహంగా ఉంటుందన్నారు. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాక్‌తో టీ20లు ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటన అనంతరం టెస్టులకు సిద్ధంకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పీసీబీ, బ్రిటిష్ హైకమిషన్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు 2005లో చివరిసారిగా ఇంగ్లండ్ పాక్‌లో పర్యటించింది.