Champions Trophy : పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy )లో భారత జట్టు ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను దాయాది గడ్డ మీదకు పంపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధంగా లేదు. అందుకని ఆసియా కప్ మాదిరిగానే ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్ (Hybrid Model) లో నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ (Hasan Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకున్నా ఏం నష్టం లేదని, క్రికెట్ ఏమీ ఆగిపోదని అలీ అన్నాడు. ఆదివారం హసన్ అలీ తమ దేశంలోని సమా (Samaa) టీవీలో మాట్లాడాడు. ”చాంపియన్స్ ట్రోఫీ కోసం ఒకవేళ భారత జట్టు రాకున్నా మేము టోర్నీ ఆడేస్తాం. టీమిండియా రానంత మాత్రాన క్రికెట్ ఆగిపోదుగా’ అని అలీ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య పాక్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

కొత్త స్టేడియాలను నిర్మించడమే కాకుండా అన్ని రకాల వసతులు కల్పించే పనిలో పీసీబీ నిమగ్నమైంది. అంతేకాదు టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ను కూడా ఐసీసీకి నివేదించింది. కానీ, బీసీసీఐ మాత్రం పాక్కు జట్టును పంపేదే లేదని భీష్మించుకుంది. దాంతో, ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన ఆడుతుందా? లేదా? అనే సందేహం ఇంకా కొనసాగుతూనే ఉంది.