Srisailam | శ్రీశైలం : అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల పండ్లతో భ్రమరాంబాదేవి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, గ్రామదేవతైన అంకాలమ్మ అమ్మవారిని అలంకరించి.. విశేష పూజలు నిర్వహించారు.

వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సార, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటిలతో పాటు తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించారు. కమల, బత్తాయి, ఆపిల్, అరటి, పనస, పచ్చిశెనగ పండ్లతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. మొదట అర్చకులు, వేద పండితులు లోక కల్యాణం కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పటించారు. అనంతరం ఉత్సవాలు ఘనంగా నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు ఏఈవో జీ స్వాములు, పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకాంబరీ దేవి ప్రస్తావన ఉన్నది. ‘నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుంచి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్ల నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ దేవి చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.

ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తిపొందింది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చొని కనిపిస్తుంది. చేతి పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయలను ధరించి దర్శనమిస్తుంది. ఈ శాకాల సముదాయంలో అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయని.. జీవులకు కలిగే ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగడుతాయని పండితులు పేర్కొంటున్నారు. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తించబడుతున్నది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని పండితులు వివరించారు.