IND vs Pak : టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్(India), పాకిస్థాన్(Pakistan) మొదటిసారి ఆసియా కప్(Asia Cup 2023)లో తలపడనున్నాయి. దాంతో, సెప్టెంబర్ 2న జరిగే ఈ మ్యాచ్‌పైనే అందరి కళ్లన్నీ నిలిచాయి. అంతేకాదు చిరకాల ప్రత్యర్థుల సమరంలో విజయం ఎవరిది? అనే చర్చలు జోరందుకున్నాయి. తాజాగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై పాక్ వికెట్‌కీపర్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకున్న జట్టే విజయం సాధిస్తుందని ఈ విధ్వంసక బ్యాటర్ చెప్పేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రిజ్వాన్ రెండు జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయని అన్నాడు.
‘భారత్ ఒక మంచి జట్టు. మాది కూడా మంచి టీమ్. టీమిండియాతో పాటు మాకు కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే ఈ మ్యాచ్‌లో ఎంతో ఒత్తడి ఉంటుంది. అయితే.. స్టార్ ఆటగాడికి, మామూలుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వాళ్లకు ఉండే పెద్ద తేడా అనుభవం. అందుకని ఎవరైతే ఒత్తిడికి తలొగ్గరో వాళ్లనే విజయం వరిస్తుంది’ అని రిజ్వాన్ వెల్లడించాడు.
ఆసియా కప్ ఆగస్టు 30న షురూ కానుంది. అయితే.. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)లో ఇరుజట్లు చెరొక విజయం సాధించాయి. ఈసారి ఎలాంటి ఫలితం రానుంది? అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. భారత్, పాక్ జట్లు వన్డే ఫార్మాట్లో ఢీ కొని మూడేళ్లు దాటింది. 2019 వరల్డ్ కప్(ODI World Cup 2019) చివరిసారి దాయాదులు ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాక్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(82 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించడంతో ఇండియా గెలుపొందింది.