Imane Khelif : ఒలింపిక్ వివాదాస్పద బాక్సర్ ఇమనె ఖెలిఫ్ (Imane Khelif) కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ‘పురుష బాక్సర్’ నిందతోనే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన ఈ అల్జీరియా బాక్సర్.. తాజాగా కొత్త లుక్‌లో కనిపించింది. అచ్చం అమ్మాయిని తలపించేలా ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఇమనెను చూసినవాళ్లంతా అవును కదా.. ‘అమ్మాయే’ అని అనకమానరు.
పూల డిజైన్లతో కూడిన డ్రెస్ ధరించి మెడలో ఒలింపిక్ స్వర్ణాన్ని వేసుకొని ఇమనె ఓ నవ్వు విసురుతూ కెమెరాకు ఫోజిచ్చింది. నిండైన జట్టును నుదిటికి ఇరువైపలా విప్పారదీసి.. చెవులకు పూల కొమ్మల్లాంటి జుంకాలతో ఇమనె చాలా స్టయిలిష్‌గా ఉంది. తనపై వస్తున్న వార్తలకు తాజా ఫొటోతో చెక్ పెడుతూ అందర్నీ షాక్‌కు గురి చేసింది ఇమనె. ఆమె వీడియో వైరల్ అవుతోంది.
Algerian boxer Imane Khelif shows off dramatic new feminine makeover, days after winning gold at the Paris Olympics. pic.twitter.com/6nlFR9HSJr
— Oli London (@OliLondonTV) August 15, 2024
నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్స్ ముందు నిర్వహించిన ‘లింగ పరీక్ష'(Gender Test)లో ఇమనె ఫెయిల్ అయింది. ఆమెలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లక్షణాలు అధికంగా ఉండడంతో అమ్మాయిల విభాగంలో పోటీ పడేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. కానీ, ఐఓసీ(IOC) మాత్రం ఖెలెఫ్ను పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒలింపిక్స్‌లో 66 కిలోల విభాగంలో పోటీ పడిన ఇమనె తొలి బౌట్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఏడు అడుగుల ఎత్తు ఉండే ఇమనె పంచ్ ధాటికి రింగ్‌లో ఎవరూ నిలువలేకపోయారు. అయితే.. 16వ రౌండ్ మ్యాచ్‌లో ఇమనె ఖెలిఫ్ కేవలం 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్‌ను యాంజెల కరిని(Angela Carini)ని ఓడించింది. దాంతో, రింగ్‌లో తనను ఓ అబ్బాయి కొడుతున్నాడని, ఖెలిఫ్ అమ్మాయి కాదని యాంజెల వాపోయింది. అంతేకాదు ఇక తాను ఫైట్ చేయలేనంటూ ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే.
విశ్వ క్రీడల సమయంలో తనపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడిన వాళ్లపై ఇమనె కేసు పెట్టింది. వాళ్ల ఆలోచనలు మార్చాలనుకుంటున్నా అని ఇమనె చెప్పింది. ‘పారిస్ ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాలో నాపై వచ్చిన వార్తలు అనైతికమైనవి. అందుకనే వాళ్లను న్యాయ పోరాటంతో ఎదుర్కోవాలని భావిస్తున్నా. ప్రపంచంలోని అలాంటివాళ్ల ఆలోచనలు మార్చాలని అనుకుంటున్నా’ అని ఇమనె వెల్లడించింది.