కారకస్: వెనిజులా(Venezuela) దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్లో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 80కి చేరుకున్నది. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొన్నది. మదురోకు చెందిన భద్రతా దళంలో చాలా మందిని అమెరికా సైన్యం చంపేసినట్లు వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపేజ్ తెలిపారు. అయితే ఆ ఆపరేషన్లో ఎంత మంది మరణించారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. సాధారణ పౌరులను అమెరికా టార్గెట్ చేసినట్లు చెబుతున్న వెనిజులా అధికారులు డెత్కౌంట్ మాత్రం అధికారికంగా వెల్లడించడం లేదు.
మరో వైపు ఆ ఆపరేషన్ సమయంలో 32 మంది తమ పౌరులు చనిపోయినట్లు క్యూబా అధికారులు చెప్పారు. దీంట్లో సైనిక సిబ్బంది కూడా ఉన్నది. అటాక్లో వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. జనవరి అయిదు, ఆరో తేదీల్లో జాతీయ సంతాప దినాలు పాటించనున్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కెనాల్ తెలిపారు. మదురోను పట్టుకునే సమయంలో జరిగిన అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి వెనిజులా విదేశాంగ మంత్రి యువాన్ గిల్ పింటో నివాళి అర్పించారు. తమ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అమెరికా నేరపూరితమైన దాడికి పాల్పడినట్లు మంత్రి ఆరోపించారు.
మదురో నిర్బంధ ఆపరేషన్లో అమెరికా సైనికులు ఎవరూ మరణించలేదని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే కొంత మంది సిబ్బంది గాయపడి ఉంటారని ఆయన చెప్పారు. మదురో, ఆయన భార్యను పట్టుకునే సమయంలో అరడజను మంది సైనికులు గాయపడినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. అమెరికా తన అటాక్ సమయంలోనే అనేక సైనిక కేంద్రాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలను పేల్చివేశారు. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల ఆరోపణలపై మదురోను అమెరికా పట్టుకున్నది. కానీ వెనిజులా నాయకత్వం మాత్రం డ్రగ్ వ్యాపారంతో సంబంధం లేదని చెబుతోంది.