అర్వపల్లి, జనవరి 05 : విద్యతోనే మహిళా, సామాజిక సాధికారత సాధ్యమని సూర్యాపేట జిల్లా జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య అన్నారు. సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను తొలగించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆడ పిల్లలను రక్షించుకోవడం (బేటీ బచావో), వారిని చదివించడం (బేటీ పడావో) ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, హెల్ప్ లైన్ నంబర్ల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్లు వినోద్, భవ్య, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.