హైదరాబాద్, ఆగస్టు 16 : ఆగస్టు 15 వ తేదీన కాలధర్మం చెందిన భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిస్సైల్ రూపకర్త, భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డా. రామ్ నారాయణ్ అగర్వాల్(RN Agarwal)అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో(Official ceremonies) నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో ఆగస్టు 17న (శనివారం) అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, రక్షణ రంగంలో డా. అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత మిస్సైల్ కార్యక్రమంలో డా. అరుణాచలం, డా. ఏపీజే అబ్దుల్ కలాం లతో కలసి డా. ఆర్.ఎం. అగర్వాల్ పనిచేశారు. హైదరాబాద్లో అడ్వాంసుడ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ (ASL )వ్యవస్థాపక డైరెక్టర్గా అగర్వాల్ పనిచేసారు. 2005 లో డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO ) లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేసిన డా. రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు.