Calcutta High Court | ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంస ఘటనపై కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై (Bengal government) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలరని ప్రశ్నించింది.
‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం. ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఆర్జీ దవాఖానలో అర్ధరాత్రి దుండగుల విధ్వంసం
మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమబెంగాల్ అట్టుడికింది. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గురువారం అర్ధరాత్రి ఆర్జీ కార్ హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
దవాఖాన ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు. తాము చేస్తున్న ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే దవాఖానపై దాడి చేశారని, అయితే న్యాయం కోసం తమ ఆందోళన కొనసాగుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికే : మమత
రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి సీపీఐ(ఎం), బీజేపీ ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఈ విషయంలో విద్యార్థులు, ఆందోళన చేస్తున్న డాక్టర్లను తప్పుబట్టడం లేదని అన్నారు. ఆర్జీ కార్ దవాఖానలో విధ్వంసం సృష్టించింది బయటివారేనని ఆమె అన్నారు. బాధిత మహిళా డాక్టర్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం తాను వీధుల్లోకి రానున్నట్టు ఆమె ప్రకటించారు.
Also Read..
Protest | ఆ రేపిస్టును ఉరితీయండి.. గౌహతి మెడికల్ కాలేజీలో జూడాల ఆందోళన.. Video
CMCH | కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో దారుణం.. హౌజ్ సర్జన్ పట్ల అసభ్య ప్రవర్తన