Daniela Larreal : ఒలింపిక్స్ సైక్లిస్ట్ డానియెల లారీయల్ చిరినోస్ (Daniela Larreal Chirinos) ఊహించని విధంగా కన్నుమూసింది. వెనిజులాకు చెందిన ఆమె 50 ఏండ్ల వయసులో తుది శ్వాస విడిచింది. విశ్వ క్రీడల్లో ఐదు పతకాలు కొల్లగొట్టి తన ముద్ర వేసిన ఆమె లాస్ వేగాస్లో విగత జీవిగా కనిపించింది. తినే ఆహారమే ఆమె పాలిట శాపమవ్వడం బాధాకరం. గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం కారణంగానే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది ఏర్పడడంతో ఆగస్టు 11వ డానియెల మృతి చెందింది. పోస్ట్ మార్టమ్ చేయగా ఆమె ఆహారవాహికలో ఘనాహారం కనిపించిందని డాక్టర్లు చెప్పారు. ఘనాహారం తిన్న తర్వాత డానియెల అస్వస్థతకు గురైంది. ఆ వెంటనే శ్వాస తీసుకోవడం ఆమె వల్ల కాలేదు. దాంతో, ప్రాణాలు విడిచిందని సమాచారం.
వెనిజులా తరఫున డానియెల ఐదు ఒలింపిక్స్లో పాల్గొంది. ఆ దేశపు అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా పేరొందిన ఆమె విశ్వ క్రీడల్లో ఐదు పతకాలతో తనకు సాటి లేదని నిరూపించింది. 1990 నుంచి 2012 వరకు ఆమె కెరీర్ సాగింది. 1996 అట్లాంటా, సిడ్నీ ఒలింపిక్స్ 2000, ఏథెన్స్ 2004, లండన్ ఒలింపిక్స్లో డానియెల పతకాలతో మెరిసింది.