Neeraj Chopra : ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా(Neeraj Chopra) తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్నాడు. సర్జరీని వాయిదా వేసుకొని మరీ లసాన్నే డైమండ్ లీగ్ (Lausanne Diamond League)లో బల్లెం వీరుడు అడుగుపెడుతున్నాడు. ఇది వరకే రెండుసార్లు విజేతగా నిలిచిన నీరజ్ హ్యాట్రిక్‌పై కన్నేశాడు. అయితే.. ఈసారి విజయం అతడికి అంత తేలిక కాకపోవచ్చు.
ఎందుకంటే.. ఒలింపిక్స్‌లో ఈటెను 90 మీటర్ల దూరం విసిరిన అర్షద్ నదీమ్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. డైమండ్ లీగ్‌లోనూ మిగతా జావెలిన్ త్రోయర్ల నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకావొచ్చు. అందుకని భారత అథ్లెట్ ఈసారి 90 మీటర్ల మార్క్ అందుకోవడంపై దృష్టి పెట్టాడు. ఆగస్టు 22 నుంచి టోర్నీ షురూ కానుంది.
పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకంతో మెరిసిన నీరజ్ చోప్రా భారత అథ్లెటిక్స్‌కు వైభవం తెచ్చాడు. ఇప్పుడు లసాన్నే డైమండ్ లీగ్‌లో చోప్రా మూడో మెడల్ లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ లీగ్‌లో నీరజ్‌కు గొప్ప రికార్డు ఉంది. మొదటిసారి 2022లో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరిన నీరజ్ విజేతగా నిలిచాడు. మరుసటి ఏడాది కూడా జోష్ చూపిస్తూ బల్లెంను 87.66 మీటర్ల దూరం విసిరి టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఒలింపిక్ మెడల్ ఉత్సాహంతో ముచ్చటగా మూడో టైటిల్ కొల్లగొట్టేందుకు నీరజ్ సిద్దమయ్యాడు.
టోక్యో ఒలింపిక్స్‌తో భారత అథ్లెట్ల ఖ్యాతిని నీరజ్ చోప్రా విశ్వవ్యాప్తం చేశాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. మూడేండ్ల తర్వాత అదే ఉత్సాహంతో పారిస్ విశ్వ క్రీడల్లోనూ వెండి వెలుగులు విరజిమ్మాడు.
క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ అంచనాలను అందుకున్నాడు. 89.34 మీటర్లతో అందరిని వెనక్కి నెట్టి ఫైనల్‌కు దూసుకెల్లాడు. పసిడి పోరులో అతడు శక్తినంత కూడదీసుకొని ఈటెను 89. 45మీటర్ల దూరం విసిరాడు. అర్షద్ నదీమ్(పాక్) 92.97 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానం దక్కించుకొని వరుసగా రెండో పతకంతో దేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.