Airfares | త్వరలో ఓనం, వినాయక చవితి, బతుకమ్మ, విజయదశమి, దీపావళి పండుగల సీజన్ ప్రారంభం కానున్నది. పండుగల వేళ ప్రతి ఒక్కరూ జాలీగా గడుపాలని కోరుకుంటారు. కాస్త ఆదాయం ఎక్కువ ఉన్న వారు పండుగ సెలవుల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. తక్కువ టైంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించాలంటే విమాన యానమే బెస్ట్. పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో విమాన యాన సంస్థలు ప్రయాణికుల టికెట్ల ధరలు పెంచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి వేడుకలు జరుపుకునేందుకు విమాన ప్రయాణం చేసే వారి కోసం దేశంలోని కీలక మార్గాల్లో 10-15 శాతం టికెట్ల ధరలు పెరుగనున్నాయి.
ఓనం పండుగ సందర్భంగా కేరళలోని వివిధ నగరాలకు విమాన ప్రయాణ టికెట్ల ధరలు 20-25 శాతం పెరుగుతాయి. కేరళలోని కొన్ని ప్రత్యేక నగరాలకు ఒకటి నుంచి 25 శాతం వరకూ ధరలు పెరిగాయి. గతేడాది ఆగస్టు 20-29 మధ్య ఓనం పండుగ సందర్భంగా విమాన టికెట్ల ధరలతో పోలిస్తే వచ్చే సెప్టెంబర్ 6-15 మధ్య ఓనం వేడుకల కోసం నాన్ స్టాప్ విమాన సర్వీసుల్లో వన్ వే టికెట్ ధర భారీగా పెరిగింది. హైదరాబాద్-తిరువనంతపురం మధ్య విమాన టికెట్ ధర 30 శాతం పెరిగి రూ.4,102 పలుకుతుంటే, ముంబై-కాలికట్ మధ్య ఇదే తరహాలో రూ.4,448 పలికింది. కొచి, కాటికట్, తిరువనంతపురం టికెట్ల ధరలు సగటున 20-25 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఫ్లైట్ బుకింగ్స్ కోసం సెర్చింగ్ రెట్టింపైంది.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ ఐదో తేదీ వరకు ఢిల్లీ-చెన్నై నాన్ స్టాప్ విమానం ఎకానమీ క్లాస్ టికెట్ ధర 25 శాతం పెరిగి రూ.7,618 పలుకుతుంది. గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య విమాన ప్రయాణ టికెట్ల ధరలతో సరిపోల్చి చూసినట్లు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో పేర్కొంది. ముంబై-హైదరాబాద్ మధ్య విమాన ప్రయాణ టికెట్ ధర 21 శాతం వృద్ధి చెంది రూ.5,162, ఢిల్లీ-గోవా మధ్య 19 శాతం పెరిగి రూ.5,999, ఢిల్లీ – అహ్మదాబాద్ రూట్ లో రూ.4,930 పలుకుతుంది. దీపావళి పండుగ సమయంలో విమాన ప్రయాణానికి గిరాకీ ఎక్కువగా ఉండటంతో పాపులర్ రూట్లు ఢిల్లీ-చెన్నై, ముంబై-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్ రూట్లలో సగటున వన్ వే విమాన టకెట్ ధర 10-15 శాతం వృద్ధితో రూ.4000-5000 మధ్య పెరుగుతున్నదని ఇక్సికో గ్రూప్ కో-సీఈఓ రజనీష్ కుమార్ తెలిపారు.
మరికొన్ని రూట్లలో విమాన టికెట్ల ధరలు ఒకటి నుంచి 27 శాతం వరకూ తగ్గిపోయాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య 27 శాతం తగ్గి రూ.2,508, ముంబై-ఉదయ్ పూర్ మధ్య 25 శాతం తగ్గి రూ.4,890లకు చేరుకున్నాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య 23శాతం తగ్గి రూ.3,383, ముంబై-జమ్ము మధ్య 21 శాతం పతనంతో 7,826లకు చేరాయి.