వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్‌ను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే నెలలోనే ఆరు దేశాలతో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉండటంతో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) వెనకడుగు వేసింది.
‘‘ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ పరిస్థితులతోపాటుగా.. ఫారెన్ ఎక్స్ఛేంజ్ చాలా సమస్యగా మారిందని, ఈ కారణంగా ఈ మెగా ఈవెంట్‌ను తాము నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది’’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు చెప్తున్నాయి.
ఈ క్రమంలో భారత్‌లో లేదంటే యూఏఈ, బంగ్లాదేశ్‌లలో ఏదో ఒక దేశంలో ఆసియా కప్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఏసీసీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.