ODI World Cup 2023 : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) పోటీలకు సిద్ధమవుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 29న పాకిస్థాన్(Pakistan), న్యూజిలాండ్(Newzealand) జట్లు ఈ గ్రౌండ్లో వామప్ మ్యాచ్(Worm-up Match) ఆడనున్నాయి. దాంతో, ఇప్పటికే అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వాళ్లందరికీ బీసీసీఐ(BCCI) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్కు ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టం చేసింది.
భద్రతా కారణాల రీత్యా ప్రేక్షకులు లేకుండానే పాక్, కివీస్ మ్యాచ్ జరుగనుందని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు టికెట్లు కొన్నవాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బక్మైషో(bookmyshow) యాజమాన్యాన్ని ఆదేశించింది. ‘పాకిస్థాన్, న్యూజిలాండ్ వామప్ మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేదు. టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది.
ఉప్పల్ స్టేడియం
సెప్టెంబర్ 28న వినాయక నిమజ్జనం(Ganesh Visarjan), మిలాన్ ఉన్ నబీ(Milan Un Nabi) వంటి పండుగలు ఉన్నాయి. అందుకని పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు బీసీసీఐకి తేల్చి చెప్పారు. దాంతో, వేరే దారిలేక ఫ్యాన్స్ లేకుండానే ఖాళీ స్టేడియంలో మ్యాచ్ ఆడించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో అక్టోబర్ 9, 10న వరుస తేదీల్లో మ్యాచ్లు ఉన్నాయి. దాంతో, తేదీలు మార్చాలని బీసీసీఐకి హెచ్సీఏ(HCA) లెటర్ రాసింది. కానీ, షెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై వరల్డ్ కప్ మొదలవ్వనుంది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి కప్పు ఎగరేసుకుపోయింది. అయితే.. అప్పటి నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. దాంతో, రోహిత్ శర్మ బృందం ఈసారి సొంత గడ్డపై చాంపియన్గా అవతరించాలనే పట్టుదలతో ఉంది.