Rahul Dravid : వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వాంఖడేలో 2019 రన్నరప్ న్యూజిలాండ్‌ను మట్టికరిపించి సొంతగడ్డపై రెండోసారి టైటిల్ పోరుకు సిద్దమైంది. టీమిండియా అద్భుత ప్రదర్శనకు కారణమైన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వరల్డ్ కప్ ఫైనల్‌తో (నవంబర్ 19) బీసీసీతో, ద్రవిడ్ బృందం ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్ జట్టుకు దూకుడుగా, భయం లేకుండా ఆడడం అలవాటు చేశాడు. ఇక బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌లు తమ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారు. దాంతో, కోచింగ్ సిబ్బందిని మార్చకుండా వీళ్లనే కొనసాగించాలని అంతా కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున బీసీసీఐ కూడా ద్రవిడ్ టీమ్‌ను మరికొన్నాళ్లు కొనసాగించే అవకాశం ఉంది.
రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా పగ్గాలు అందుకున్న ద్రవిడ్ అనతికాలంలోనే తనముద్ర వేశాడు. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌లోనే ఇంటిదారి పట్టడంతో ద్రవిడ్ తన వ్యూహాలకు పదును పెట్టాడు. జట్టులో రొటేషన్ పద్ధతికి శ్రీకారం చుట్టడమే కాకుండా వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లపై నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ అయ్యర్, రాహుల్ వరల్డ్ కప్‌లో భారీ స్కోర్లు చేస్తూ జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నారు.