CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఒకో అడుగు ముందుకు వేస్తున్నదని, తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని, ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్లో ప్రారంభించబోతున్నామని చెప్పారు.
అంతర్జాతీయ స్ధాయి కోచ్‌లను తీసుకొచ్చి క్రీడాకారులకు శిక్షణ అందిస్తామని, ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియాలని తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు.