హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్‌కు రంగం సిద్ధమైంది. నగరం వేదికగా ఈనెల 25న జరిగే హైదరాబాద్ మారథాన్‌లో 25,500కు పైగా రన్నర్లు పోటీపడుతున్నారు. ఇందులో భారత్‌తో సహా 17 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎమ్డీసీ సహకారంతో జరుగుతున్న 13వ ఎడిషన్ కోసం నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ రేసుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మరథాన్‌లో భాగంగా మంగళవారం జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భారత స్టార్ బాక్సర్ నిఖత్జరీన్ ముఖ్య అతిథిగా హాజరైంది. జెర్సీతో పాటు పతకాలు ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ నెల 24న హైటెక్స్‌లో 5కే రన్‌తో మారథాన్ సందడి మొదలుకానుంది. ఈనెల 25న ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ జరుగనున్నాయి.