గాలె(శ్రీలంక) : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక దీటుగా రాణిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ బంగ్లా బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తున్నది. ఓపెనర్ పతుమ్ నిస్సనక(187) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గత రెండు సెంచరీలను విదేశీ గడ్డపై కొట్టిన నిస్సనక తొలిసారి స్వదేశంలో సెంచరీ ఖాతా తెరిచాడు. మరో ఓపెనర్ లాహిరు ఉడానా(29) స్వల్ప స్కోరుకే పరిమితమైన నిస్సనక తన నిలకడ కొనసాగించాడు.
డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న ఈ యువ బ్యాటర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో వెనుదిరిగి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు అందుకున్నాడు. మిడిలార్డర్లో సీనియర్ బ్యాటర్ చండిమల్ (54) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న మాథ్యూస్ (39) ఫర్వాలేదనిపించాడు. తైజుల్, నయిమ్, మోమినుల్ ఒక్కో వికెట్తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 484/9 మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన బంగ్లా 495 స్కోరుకు ఆలౌటైంది.