Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) పంచ్ పవర్ చూపించింది. 50 కిలోల విభాగంలో శుభారంభం చేసి 16వ రౌండ్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన బౌట్లో జర్మనీ బాక్సర్ మాక్సీ కరినా క్లొయెట్జర్(Maxi Carina Cloetzer)ను నిఖత్ చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన తెలంగాణ బిడ్డను జడ్జిలు ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు.
ఒలింపిక్స్‌లో కఠినమైన ప్రత్యర్థుల గ్రూప్‌లో ఉన్న నిఖత్ జరీన్ తొలి అడుగు ఘనంగా వేసింది. ఆరంభం నుంచే మాక్సీపై విరుచుకుపడింది. దాంతో, మ్యాక్సీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్ష పోరులో నిఖత్ 5-0తో గెలుపొందింది. ఆగస్టు 1న జరిగే తర్వాతి రౌండ్లో ఆమె చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది.
రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన నిఖత్‌కు ఇదే తొలి ఒలింపిక్స్. నాలుగేండ్ల క్రితం క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మేరీ కోమ్(Mary Kom) చేతిలో ఓడిన ఇందూరు బిడ్డ టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) చాన్స్ కోల్పోయింది. ఆ తర్వాత రింగ్‌లో మరింత రెచ్చిపోయింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసింది. ఆ తర్వాత ఆసియా క్రీడ(Asian Games 2022)ల్లోనూ కాంస్యంతో చరిత్ర సృష్టించింది.
మరోవైపు టేటుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అచంట శరత్ కమల్(Achantha Sharat Kamal) నిరాశపరిచాడు. ఒలింపిక్స్‌లో భారత పతకధారి అయిన కమల్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. స్లొవేనియా ఆటగాడు డెని కొజుల్పై తొలి సెట్ గెలిచిన కమల్ ఆ తర్వాత జోరు చూపలేకపోయాడు. వరుస సెట్లలో ఓడి 12-10, 9-11, 6-11, 7-11, 11-8, 10-12తో మ్యాచ్ చేజార్చుకున్నాడు.