పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఈ ఏడాది స్టార్ క్రికెటర్ల రిటైర్మెంట్ల పరంపరను కొనసాగిస్తూ మరో ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో బంతిని బలంగా బాదగల సమర్థుడు, టీ20 క్రికెట్లో సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడి వయసు 29 ఏండ్లు మాత్రమే కావడం గమనార్హం. 2016లో కరేబియన్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఈ హార్డ్ హిట్టర్.. ఇప్పటిదాకా 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు. వెస్టిండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పూరన్ (2,275 రన్స్) అగ్రస్థానంలో ఉన్నాడు.
50 ఓవర్ల ఫార్మాట్లో అతడు.. 39.66 సగటుతో 1,983 రన్స్ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ టీ20 జట్టులో పూరన్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పూరన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికినట్టు వార్తలు వస్తున్నాయి. రిటైర్మెంట్పై పూరన్ స్పందిస్తూ.. ‘సుదీర్ఘ ఆలోచనల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. మెరూన్ రంగు జెర్సీ ధరించడం, జాతీయ గీతం కోసం నిలబడటం నాకు ఎంతో ప్రత్యేకం’ అని రాసుకొచ్చాడు.
పూరన్ చివరిసారిగా 2024 డిసెంబర్లో వెస్టిండీస్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. 2022లో విండీస్ పరిమిత ఓవర్ల జట్టుకు సారథిగా నియమితుడైన పూరన్.. ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్ పరాభవం తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జాతీయ జట్టు నుంచి వైదొలిగినా ఫ్రాంచైజీ క్రికెట్లో అతడు కొనసాగనున్నాడు. ఐపీఎల్లో పూరన్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న విషయం విదితమే. ఇటీవలే ముగిసిన 18వ సీజన్లో అతడు.. ఏకంగా 196 సగటుతో 524 రన్స్ చేశాడు.