భారత్‌కు భంగపాటు! సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ఇండియాకు ఊహించని రీతిలో చుక్కెదురైంది. బెంగళూరు ఓటమిని మరిపిస్తూ పుణెలో సిరీస్‌ను సమం చేస్తారనుకున్న మనోళ్లు అన్నింటా విఫలమైఘోర అపజయాన్ని మూటగట్టుకున్నారు. గత కొన్నేండ్లుగా అప్రతిహత విజయాలతో వరుసగా 18 సిరీస్‌లతో దూసుకెళుతున్న టీమ్ఇండియాకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ పుణె టెస్టులో కివీస్ విజయదుందుభి మోగించింది.సాంట్నర్ ఆరు వికెట్ల విజృంభణతో రోహిత్‌సేన కుప్పకూలింది. జైస్వాల్, జడేజా అంతోఇంతో పోరాడినా..మిగతావాళ్లు బ్యాట్లు ఎత్తేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా పుష్కరం (12 ఏండ్ల) తర్వాత భారత్‌కు సిరీస్ పరాజయం ఎదురైతే..దాదాపు 70 ఏండ్ల తర్వాత కివీస్ తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేండ్లుగా సాధ్యం కాని అరుదైన రికార్డును కివీస్ సొంతం చేసుకుంది.
పుణె: భారత్‌కు ఘోర పరాభవం. తమ స్పిన్ తంత్రంతో దశాబ్దాలుగా ప్రత్యర్థి జట్లపై అసమాన విజయాలతో దూసుకెళుతున్న టీమ్ఇండియా దుర్భేద్యమైన కోటకు బీటలు పడ్డాయి. కొరకరాని కొయ్యగా, తీరని కలగా మిగిలిన భారత్‌లో భారత్‌పై టెస్టు సిరీస్ విజయాన్ని న్యూజిలాండ్ ఇన్నేండ్లకు సాకారం చేసుకుంది. ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ 113 పరుగుల తేడాతో భారత్‌పై చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా 1955 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న కివీస్ తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని ముద్దాడింది.
కివీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యఛేదనలో భారత్..245 పరుగులకు పరిమితమైంది. స్టార్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్(6/104) ధాటికి టీమ్ఇండియా బ్యాటర్లు కుదేలయ్యారు. యశస్వి జైస్వాల్(77), జడేజా(42) మినహా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 198/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్..255 పరుగులకు ఆలౌటైంది. సుందర్(4/56), జడేజా(3/72), అశ్విన్(2/97) రాణించారు. ఫిలిప్స్(48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 వికెట్లతో జట్టు చిరస్మరణీయ విజయంలో కీలకమైన సాంట్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య వచ్చే నెల 1 నుంచి ముంబైలో మూడో టెస్టు జరుగనుంది.
కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ మళ్లీ విజృంభించాడు. భారత స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపని పిచ్‌పై సాంట్నర్ వికెట్ల వేట కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్ దూకుడుకు కొనసాగింపుగా సాంట్నర్ ఆరు వికెట్ల విజృంభణతో భారత్ ఓటమి వైపు నిలిచింది. నిర్దేశిత లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్‌శర్మ(8) మరోమారు నిరాశపరిచాడు. జైస్వాల్, గిల్(23) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే బాధ్యతను భుజానేసుకున్నారు. ముఖ్యంగా జైస్వాల్ మెరుగైన పరిణతి కనబరిచాడు. చక్కని ఆటతీరుతో కివీస్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు.
సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్లోగిల్ను ఔట్ చేయడం ద్వారా సాంట్నర్..కివీస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. లంచ్ విరామం వరకు 81/1తో మెరుగ్గా కనిపించిన టీమ్ఇండియా ఆ తర్వాత సాంట్నర్ స్పిన్ మాయాజాలంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జైస్వాల్, పంత్(0), కోహ్లీ(17), సర్ఫరాజ్‌ఖాన్(9) తేలిపోయారు. సుందర్(21) ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో జడేజా, అశ్విన్(18) కివీస్‌ను నిలువరించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మొత్తంగా స్పిన్‌తో పడగొడుదామనుకున్న భారత్ అదే ఉచ్చులో చిక్కుకుని ఊహించని పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
భారత్‌లో భారత్‌పై టెస్టు సిరీస్ గెలువడం కివీస్‌కు ఇది తొలిసారి. దీనికి ముందు భారత్‌పై రెండు టెస్టుల్లో (1969, 1988) మాత్రమే గెలిచింది.
స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారతబ్యాటర్గా జైస్వాల్ (1056) నిలిచాడు. విశ్వనాథ్(1047) రికార్డును జైస్వాల్ అధిగమించాడు.
స్వదేశంలో ఈ ఏడాది టెస్టుల్లో భారత్‌కు ఎదురైన ఓటములు. కివీస్‌పై రెండు, ఇంగ్లండ్‌పై ఒక ఓటమి ఎదుర్కొంది.
భారత కెప్టెన్‌గా రోహిత్‌శర్మ స్వదేశంలో నాలుగు టెస్టులు ఓడిపోయాడు. కపిల్‌దేవ్, అజారుద్దీన్ సరసన రోహిత్ నిలువగా, అలీఖాన్ పటౌడీ 9 ఓటములతో ముందున్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత్ వరుసగా 18 టెస్టు సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. చివరిసారి 2012లో ఇంగ్లండ్‌కు సిరీస్ చేజార్చుకుంది.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259,
భారత్ తొలి ఇన్నింగ్స్: 156 ఆలౌట్,
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 255 ఆలౌట్,
భారత్ రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్(జైస్వాల్ 77, జడేజా 42, సాంట్నర్ 6/104, ఫిలిప్స్ 2/43)