వైజాగ్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు.. నాలుగో పోరులో ఓటమిపాలైంది. బంతితో విఫలమవడమే గాక టాపార్డర్ వైఫల్యంతో కివీస్ చేతిలో 50 పరుగుల తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో సిరీస్‌లో న్యూజిలాండ్.. భారత ఆధిక్యాన్ని 1-3కు తగ్గించింది.‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో న్యూజిలాండ్.. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఆరంభం నుంచే చతికిలపడ్డ టీమ్ఇండియా.. 18.4 ఓవర్లలో 165 రన్స్‌కే చేతులెత్తేసింది. టాపార్డర్ విఫలమైనా శివమ్ దూబె (23 బంతుల్లో 65, 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసకరంగా పోరాడగా రింకూ సింగ్ (30 బంతుల్లో 39, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించి పరువు కాపాడారు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (3/26) కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశాడు. ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరిదైన ఐదో మ్యాచ్ ఈనెల 31న తిరువనంతపురంలో జరుగుతుంది.
టాపార్డర్ వైఫల్యంతో..
భారీ ఛేదనలో తొలి బంతికే విధ్వంసక వీరుడు అభిషేక్ శర్మను డకౌట్ చేసిన న్యూజిలాండ్.. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచింది. టాపార్డర్ వైఫల్యం ఆ జట్టుకు కలిసొచ్చింది. గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ సూర్య (8).. డఫ్ఫీ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. శాంసన్ (15 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) టచ్‌లోకి వచ్చినట్టే కనిపించినా శాంట్నర్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా (2)నూ శాంట్నర్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో రింకూ, దూబె పోరాడారు. మూడో స్థానంలో వచ్చిన రింకూ.. ధాటిగానే ఆడినా ఫోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా నిష్క్రమించాడు. దీంతో జట్టు గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న దూబె.. సోధి వేసిన 12వ ఓవర్లో 4, 6, 4, 6, 6తో ఏకంగా 29 రన్స్ రాబట్టాడు. డఫ్ఫీ మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో 15 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ సాధించాడు. జోరుమీదున్న దూబె.. దురదృష్టవశాత్తూ రనౌట్ అవడంతో భారత ఓటమి ఖరారైంది. దూబె నిష్క్రమించాక భారత లోయరార్డర్ పెద్దగా కష్టపడకుండానే చేతులెత్తేయడంతో ఈ సిరీస్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.
మోత మోగించిన సీఫర్ట్, కాన్వే
ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల ఆటే హైలైట్. సీఫర్ట్, కాన్వే బౌండరీలు, సిక్స్‌లతో మోతెక్కించి తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆ జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో బాదుడుకు శ్రీకారం చుట్టిన సీఫర్ట్.. క్రీజులో ఉన్నంతసేపూ అదే దూకుడును కొనసాగించాడు. అతడి మెరుపులతో పవర్ ప్లేలోనే కివీస్ వికెట్లేమీ నష్టపోకుండా 71 రన్స్ చేసింది. మరో ఎండ్‌లో కాన్వే సైతం.. బిష్ణోయ్ 6వ ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. 8వ ఓవర్లో తొలి బంతిని మిడాఫ్ దిశగా సింగిల్ తీసిన సీఫర్ట్ ఈ సిరీస్‌లో తన తొలి అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న కాన్వే.. కుల్దీప్ 9వ ఓవర్లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. మరుసటి ఓవర్లో రచిన్ (2).. బుమ్రా ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13వ ఓవర్లో అర్ష్‌దీప్.. సీఫర్ట్‌ను ఔట్ చేశాడు. అదే ఊపులో భారత్.. ఫిలిప్స్ (24), చాప్మన్ (9), శాంట్నర్ (11) వికెట్లు పడగొట్టినా ఆఖర్లో డారిల్ మిచెల్ (39 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 215/7 (సీఫర్ట్ 62, కాన్వే 44, అర్ష్‌దీప్ 2/33, కుల్దీప్ 2/39); భారత్: 18.4 ఓవర్లకు 165 ఆలౌట్ (దూబె 65, రింకూ 39, శాంట్నర్ 3/26, డఫ్ఫీ 2/33)