బే ఓవల్ (మౌంట్ మొంగనుయ్): న్యూజిలాండ్‌తో శనివారం ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో గెలవాల్సిన మ్యాచ్‌లో లంకేయులు చేజేతులా ఓటమి పాలయ్యారు. 173 పరుగుల ఛేదనలో భాగంగా ఒక దశలో 13 ఓవర్లకు 120/0గా ఉన్న లంక.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలి ఓటమిని కొని తెచ్చుకుంది. ఓపెనర్ల శతాధిక భాగస్వామ్యంతో మెరిసినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లడంతో 20 ఓవర్లలో 164/8 వద్దే ఆగిపోయి 8 పరుగుల తేడాతో ఓడింది.
ఫలితంగా పథుమ్ నిస్సంక (60 బంతుల్లో 90, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (36 బంతుల్లో 46, 6 ఫో ర్లు, 1 సిక్స్) పోరాటం వృథా అయింది. కివీస్ పేసర్ జేకబ్ డఫ్ఫీ (3/12), మ్యాట్ హెన్రీ (2/28) లంక బ్యాటర్లను కట్టడి చేశా రు. అంతకుముందు డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రాస్‌వెల్ (59) మెరవడంతో న్యూజిలాండ్.. నిర్ణీత ఓవర్లలో 172/8 స్కోరు సాధించింది.