అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో భారత్‌కు అభిమానులు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేని అవమానకర ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చులో పడి భారత బ్యాటర్లు విలవిల్లాడిన వేళ.. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా స్వదేశంలో వైట్‌వాష్ అయింది. బంతి గింగిరాలు తిరిగిన వాంఖడే పిచ్‌పై పర్యాటక జట్టు నిర్దేశించిన 147 పరుగులను ఛేదించలేక రోహిత్ సేన 121 పరుగులకే చేతులెత్తేసింది. రిషభ్ పంత్ ఒంటరి పోరాటం మినహా భారత స్టార్ బ్యాటర్లంతా అత్యంత చెత్త ఆట ఆడి వికెట్లను సమర్పించుకోవడంతో న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ ద్వయం రాణించడంతో కివీస్ సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. స్వదేశంలో 1933 నుంచి టెస్టులు ఆడుతున్న భారత్.. సొంతగడ్డపై మూడు అంతకుమించి టెస్టులు ఆడుతూ వైట్‌వాష్ అవడం ఇదే తొలిసారి.
ముంబై: తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని, సగటు క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఘోర పరాజయం! స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్.. 0-3తో కోల్పోయి అత్యంత అవమానకర ఓటమిని ఎదుర్కుంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లనూ గడగడ వణికించి ప్రత్యర్థిని ఉట్టిచేతులతో ఇంటికి పంపే టీమ్ఇండియా.. 24 ఏండ్ల తర్వాత (చివరిసారి 2000లో దక్షిణాఫ్రికాపై) దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మూడో రోజు ఆటలో కివీస్ నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప ఛేదనలో రోహిత్ సేన.. 121 పరుగులకే కుప్పకూలి 25 పరుగుల తేడాతో అపజయం పాలైంది. ఛేదనలో రిషభ్ పంత్ (57 బంతుల్లో 64, 9 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడగా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే చేతులెత్తేయడంతో ‘మెన్ ఇన్ బ్లూ’కు పరాభవం తప్పలేదు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (6/57) వాంఖడేలో మరోసారి అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేయగా గ్లెన్ ఫిలిప్స్ (3/42) కూడా దెబ్బకొట్టడంతో ఆ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ టెస్టులో 11 వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా విల్ యంగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
ఓవర్ నైట్ స్కోరు (171)కు మరో 3 పరుగులు మాత్రమే జోడించిన కివీస్ ఆలౌట్ అయి భారత్ ఎదుట 147 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఛేదనలో 3వ ఓవర్ నుంచే భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (11) హెన్రీ వేసిన బంతిని పుల్ షాట్ ఆడబోయి మిడ్‌వికెట్ వద్ద ఫిలిప్స్‌కు చిక్కడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. తర్వాత అజాజ్ వరుస ఓవర్లలో షాకులిచ్చాడు. 4వ ఓవర్ ఆఖరి బంతికి అతడు శుభ్‌మన్ గిల్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేయగా తన మరుసటి ఓవర్లో కోహ్లీ (1)ని పెవిలియన్‌కు పంపాడు. 7వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. జైస్వాల్(5)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (1) స్వీప్ షాట్ ఆడబోయి డీప్ స్కేర్ వద్ద రచిన్ చేతికి చిక్కడంతో భారత్ 29 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 16 పరుగుల వ్యవధిలో ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు.
ఎదుర్కున్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పంత్.. రవీంద్ర జడేజా (6)తో కలిసి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడిస్తే అందులో పంత్‌వే 32. పంత్ ఒక్కో పరుగు కూడబెడుతూ లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో 16వ ఓవర్ వేసిన అజాజ్.. జడేజాను ఔట్ చేసి మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. లంచ్‌కు ముందు ఓవర్లో పంత్ రెండు ఫోర్లు కొట్టి 48 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. రెండో సెషన్లో భారత్ విజయానికి 55 పరుగులు అవసరమవగా అజాజ్ 22వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పంత్.. నాలుగో బంతికి థర్డ్ అంపైర్ వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయంతో వెనుదిరిగాడు. పంత్ నిష్క్రమించాక 8 ఓవర్లలోపే భారత లోయరార్డర్ కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ (12) ఆశలు కల్పించినా అతడి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
మ్యాచ్‌లో పంత్ ఔట్ అయిన తీరుతో మరోసారి డీఆర్ఎస్ ఫలితాలపై చర్చ మొదలైంది. అజాజ్ వేసిన బంతిని పంత్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ అదికాస్తా మిస్ అయి వికెట్ కీపర్ బ్లండెల్ చేతిలో పడింది. కివీస్ అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఆ జట్టు డీఆర్ఎస్ తీసుకుంది. టీవీ రిప్లేలో బంతి బ్యాట్ అంచును ముద్దాడుతూ ప్యాడ్లను తాకినట్టు స్పష్టంగా తేలింది. అదే సమయంలో బ్యాట్ సైతం ప్యాడ్‌ను తాకినట్టు ఉందనే అనుమానాన్ని పంత్ ఆన్‌ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం దీనిని ఔట్‌గా ప్రకటించడం భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.
1 ఒక టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు టెస్టులు గెలవడం న్యూజిలాండ్‌కు స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఇదే మొదటిసారి.
1 91 ఏండ్ల భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతూ వైట్‌వాష్ అవడం టీమ్ఇండియాకు ఇదే ప్రథమం.
1 ఇరు జట్ల లెఫ్టార్మ్ స్పిన్నర్లు (జడేజా, అజాజ్) రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
3 స్వదేశంలో వైట్‌వాష్ ఎదుర్కున్న సారథులలో రోహిత్ శర్మ మూడోవాడు. గుండప్ప విశ్వనాథ్ (1980లో ఇంగ్లండ్‌పై), సచిన్ టెండూల్కర్ (2000లో సౌతాఫ్రికాపై) తర్వాత ఆ చెత్త రికార్డును రోహిత్ మూటగట్టుకున్నాడు.
4 భారత్‌ను స్వదేశంలో ఇంగ్లండ్ (4సార్లు), ఆసీస్ (3 సార్లు), వెస్టిండీస్ (ఒకసారి) తర్వాత క్లీన్‌స్వీప్ చేసిన నాలుగో జట్టు కివీస్.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 ఆలౌట్;
భారత్ తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్;
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 174 ఆలౌట్;
భారత్ రెండో ఇన్నింగ్స్: 121 ఆలౌట్ (పంత్ 64, సుందర్ 12, అజాజ్ 6/57, ఫిలిప్స్ 3/42)