క్రిస్ట్‌చర్చ్: ఇటీవలే స్వదేశంలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యం తర్వాత జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి సారథిని మార్చినా పాకిస్థాన్ ఆటతీరులో మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘోర పరాభవంతో ప్రారంభించింది. క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో పాక్ 9 వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 18.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లిద్దరూ డకౌట్ అవగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ (32) ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (18) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లు జాకబ్ డఫ్ఫీ (4/14), జెమీసన్ (3/8) ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. అనంతరం ఛేదనను కివీస్ 10.1 ఓవర్లలోనే దంచేసింది. సీఫర్ట్ (44), ఫిన్ అలెన్ (29 నాటౌట్) వేగంగా ఆడారు.