Pune Test | సొంతగడ్డపై టెస్టుల్లో తమకు తిరుగేలేదనుకున్న భారత్‌కు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్నది. బెంగళూరులో పదునైన పేస్‌తో టీమ్ఇండియాకు ఘోర ఓటమి రుచి చూపించిన కివీస్..పుణెలో స్పిన్‌తో పట్టు బిగించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్ల విజృంభణతో భారత్ 156 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ కోహ్లీ సింగిల్ డిజిట్‌తో భారంగా పెవిలియన్ చేరగా, మిగతా వాళ్లు అంతో ఇంతో ఫర్వాలేదనిపించారు. కివీస్ స్పిన్నర్లు రెచ్చిపోయిన పిచ్‌పై భారత స్పిన్నర్లు ప్రభావం చూపని వేళ కివీస్ ప్రస్తుతం 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇదే దూకుడు కొనసాగిస్తూ భారత్ ముందు భారీ లక్ష్యం నిర్దేశిస్తే.. చారిత్రక సిరీస్ విజయం కివీస్ సొంతమైనట్లే. మూడో రోజు ఆట రసపట్టుగా సాగే అవకాశముంది.
పుణె: ఎవరూ తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమై బెంగళూరులో భారీ ఓటమి మూటగట్టుకుంటే సిరీస్ గెలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన పుణెలో మనోళ్లు ఆపసోపాలు పడుతున్నారు. కొట్టిన పిండిల్లాంటి సొంత పిచ్‌లపై గల్లీ క్రికెటర్లను తలపిస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. భారత బ్యాటర్లు విఫలమైన చోట స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కివీస బ్యాటర్లు అదరగొడుతున్నారు. కెప్టెన్ టామ్ లాథమ్(86) అర్ధసెంచరీతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 198/5 స్కోరు చేసింది.
టామ్ బ్లండెల్(30 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్(9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్(4/56) నాలుగు వికెట్లతో రాణించాడు. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ 45.3 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. జడేజా(38), గిల్(30), జైస్వాల్(30) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ(1), పంత్(18), సర్ఫరాజ్‌ఖాన్(11), అశ్విన్(4) ఘోరంగా విఫలమయ్యారు.
సాంట్నర్(7/53) ఏడు వికెట్ల విజృంభణతో టీమ్ఇండియా పతనంలో కీలకమయ్యాడు. ఊరించే బంతులతో భారత బ్యాటర్లను సాంట్నర్ అద్భుతంగా బోల్తా కొట్టించాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న కివీస్ ప్రస్తుతం 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇదే దూకుడు కొనసాగిస్తూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించి భారత్‌ను కట్టడి చేసేందుకు కివీస్ పట్టుదలతో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్ టీమ్ఇండియాకు కీలకం కానుంది.
భారత స్పిన్నర్లు ప్రభావం చూపని చోట కివీస్ స్పిన్నర్లు తమదైన స్పిన్ మాయాజాలంతో చెలరేగిపోయారు. ఓవైపు సాంట్నర్ ఏడు వికెట్లు కూలిస్తే..పార్ట్ టైమర్ ఫిలిప్స్ (2/26) రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమ్ఇండియా ఆది నుంచే తడబడింది. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద గిల్‌ను సాంట్నర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 6 పరుగుల తేడాతో కోహ్లీ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
సాంట్నర్ ఊరించే ఫుల్‌టాస్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోని కోహ్లీ..బ్యాటును అడ్డంగా ఊపడంతో బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశబ్ద వాతావరణం అలుముకుంది. జైస్వాల్..ఫిలిప్స్ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి బౌటయ్యాడు. పంత్‌ను ఫిలిప్స్ క్లీన్‌బౌల్డ్ చేయగా, సర్ఫరాజ్‌ను సాంట్నర్ పెవిలియన్ పంపాడు. అశ్విన్, జడేజా, ఆకాశ్‌దీప్(6), బుమ్రా(0)ను సాంట్నర్ ఔట్ చేయగా, సుందర్(18) నాటౌట్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 156 ఆలౌట్(జడేజా 38, జైస్వాల్ 30, సాంట్నర్ 7/53), ఫిలిప్స్ 2/26), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 198/5(లాథమ్ 86, బ్లండెల్ 30 నాటౌట్, సుందర్ 4/56, అశ్విన్ 1/64)