మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ దారుణంగా విఫలమవడంతో ఓటమి అనివార్యమైంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ తీవ్ర ంగా నిరాశపరిచారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్.. టోర్నీని ఘనంగా మొదలుపెట్టింది.
T20 World Cup | దుబాయ్: భారీ ఆశలతో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి వెళ్లిన భారత క్రికెట్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు న్యూజిలాండ్ షాకిచ్చింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ అమ్మాయిలు.. భారత్‌ను 58 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 57 నాటౌట్, 7 ఫోర్లు) ధనాధన్ ఆటతో విరుచుకుపడగా ఓపెనర్ ప్లిమ్మర్ (23 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ (2/27) రాణించింది. లక్ష్య ఛేదనలో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (15) టాప్ స్కోరర్. కివీస్ పేసర్ రొస్‌మెరీ మెయిర్ (4/19), లీ తహుహు (3/15), ఈడెన్ కార్సన్ (2/34) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డివైన్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సూజి బేట్స్ (27), ప్లిమ్మర్ తొలి వికెట్‌కు 7.4 ఓవర్లలోనే 67 పరుగులు జతచేశారు. వీరి దూకుడుతో 6.4 ఓవర్లలోనే ఆ జట్టు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తిచేసింది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి ఇన్నింగ్స్ 8వ ఓవర్లో నాలుగో బంతికి బేట్స్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీసింది. మరుసటి ఓవర్లోనే ప్లిమ్మర్.. ఆశా శోభన బౌలింగ్‌లో స్మృతి మంధానకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. డివైన్ సింగిల్స్‌కే పరిమితమైంది. అమెలియా కెర్ (13)ను రేణుకా వెనక్కి పంపింది. కానీ దీప్తి శర్మ 18వ ఓవర్లో బ్రూక్ హాలిడే (16) రెండు ఫోర్లు కొట్టగా డివైన్ కూడా ఓ బౌండరీ బాది స్కోరు వేగాన్ని పెంచింది. ఆఖరి ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన డివైన్.. హాఫ్ సెంచరీని పూర్తిచేసుకుంది.
మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ రెండో ఓవర్ నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ (2) రెండో ఓవర్ తొలి బంతికే ఈడెన్ కార్సన్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించిన స్మృతి మంధాన (12) కూడా కార్సన్ 5వ ఓవర్లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మెయిర్ 6వ ఓవర్లో హర్మన్‌ప్రీత్ వికెట్ల ముందు దొరికిపోయింది. టీమ్ఇండియా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్ (13), రిచా ఘోష్ (12) తీవ్రంగా నిరాశపరిచారు. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (13), బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రకార్ (8) సైతం విఫలమయ్యారు. ఈ టోర్నీలో భారత్.. ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది.