దుబాయ్: న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ(Matt Henry).. ఆదివారం జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడేది అనుమానంగా ఉంది. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. క్యాచ్ పట్టే తరుణంలో అతను కింద పడ్డాడు. ఆ సమయంలో అతని కుడి భుజానికి గాయమైంది. అయితే మ్యాట్ హెన్రీ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు.
టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా హెన్రీ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 10 వికెట్లు తీసుకున్నాడు. భారత్‌తో జరిగిన గ్రూపు మ్యాచ్‌లో అతను 5 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. భుజంపై పడడంతో ప్రస్తుతం మ్యాట్ ఇబ్బందిపడుతున్నాడని, ఒకవేళ అతను బౌలింగ్ చేయగలిగితే తమకు పాజిటివ్‌గా ఉంటుందని కోచ్ స్టీడ్ తెలిపారు. మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని ఆశిస్తున్నామని, ఈ మ్యాచ్‌లో ఆడేందుకు అతనికి అవకాశాలు కల్పిస్తామని, కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.
న్యూజిలాండ్ ఈ టోర్నీలో ఒకే మ్యాచ్ ఓడింది. భారత్ చేతిలోనే ఆ మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. అయితే ఆ మ్యాచ్‌లో హెన్రీ అద్భుతంగా బౌల్ చేశాడు. ఒకవేళ గాయపడ్డ హెన్రీ బరిలోకి దిగితే, అప్పుడు మ్యాచ్ రసవత్తరంగా మారే ఛాన్సు ఉంది.