హమిల్టన్ (న్యూజిలాండ్) : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో చిత్తుగా ఓడిన పాక్.. అదే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నది. హమిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్.. పాక్‌పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ కీపర్ మిచెల్ హే (78 బంతుల్లో 99 నాటౌట్, 7 ఫోర్లు, 7 సిక్సర్లు), మహ్మద్ అబ్బాస్ (41) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 41.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. లోయరార్డర్లో ఫహీమ్ అష్రఫ్ (73), నసీమ్ షా (51) ఆదుకున్నారు. కివీస్ పేసర్ బెన్ సీర్స్ (5/59) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా జాకబ్ డఫ్ఫీ (3/35) రాణించాడు.