Team India | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్‌లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్‌లో అవే మనల్ని నిండా ముంచాయా? అంటే సమాధానం ఔననే చెప్పక తప్పదు. ప్రపంచ చాంపియన్లం అని విర్రవీగిన కంగారూల మెడలు వంచి, ‘బజ్‌బాల్’ ఆట అంటూ ఊదరగొట్టిన ఇంగ్లండ్‌కూ చుక్కలు చూపించి అలవోకగా సిరీస్‌లను కొల్లగొట్టిన టీమ్ఇండియా.. ఇప్పుడదే పిచ్‌లపై కివీస్ చేతిలో చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. సొంతగడ్డపై అనుకూలించే పరిస్థితులు, స్పిన్‌ను ఆడటంలో సుదీర్ఘ అనుభవం, ప్రత్యర్థి స్పిన్నర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే భారత బ్యాటర్లు కివీస్‌తో సిరీస్‌లో స్పిన్‌ను ఆడలేక చతికిలపడ్డ తీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.
అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ ప్రత్యర్థులను స్పిన్ ఉచ్చులో బంధించి ఆపై బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లతో కొండంత స్కోర్లు చేసి విదేశీ జట్లను చుట్టేయడం భారత్‌కు ఆనవాయితీ. కానీ కివీస్‌తో సిరీస్‌లో ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఈ ఏడాది భారత పర్యటనలో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను జట్టులో చేర్చిన ఇంగ్లండ్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ల సగటు దాదాపు 40 (39.8)గా నమోదైంది. యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు ఇంగ్లీష్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ భారత బ్యాటర్ల సగటు 42.9గా ఉంది. కానీ అదే కివీస్ స్పిన్నర్లను ఎదుర్కునే క్రమంలో అది 24.4కు పడిపోయింది. మొత్తంగా ఈ సిరీస్‌లో మన బ్యాటర్ల సగటు 21.55గా నమోదైందంటే ‘టర్నింగ్ ట్రాక్స్’పై మన బ్యాటర్ల వైఫల్యం ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
భారత బ్యాటర్లు క్రీజులో నిలబడటానికే తంటాలుపడ్డ పిచ్‌లపై కివీస్ అంచనాలకు మించి రాణించింది. అశ్విన్, జడేజా వంటి మేటి స్పిన్నర్లున్నప్పటికీ ఆ జట్టులో డారెల్ మిచెల్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర స్పిన్‌ను దీటుగా ఎదుర్కున్నారు. పుణె టెస్టులో రోహిత్ సేనను శాంట్నర్ తన స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడితే స్టార్ భారత స్పిన్ మాంత్రికుడు అశ్విన్ మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ జట్టు స్పిన్నర్లంతా 60 వికెట్లు (షోయబ్ బషీర్ 17, రిహాన్ అహ్మద్ 11, టామ్ హర్ట్లీ 22, జో రూట్ 8, జాక్ లీచ్ 2) తీశారు.
తాజాగా కివీస్ సిరీస్ గెలవడంలో ఆ జట్టు స్పిన్నర్లదే కీలకపాత్ర. ఒకే టెస్టు ఆడిన శాంట్నర్ 13 వికెట్లు తీయగా అజాజ్ పటేల్ 11, ఫిలిప్స్ 7 వికెట్లు పడగొట్టారు. మూడు టెస్టులలో కివీస్ స్పిన్నర్లు 37 వికెట్లు పడగొట్టడం విశేషం. స్వదేశాన భారత స్పిన్నర్ల ఆధిపత్యం తగ్గడమే గాక విదేశీ స్పిన్నర్లు పట్టు దక్కించుకున్నారనడానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇకనైనా స్పిన్ ట్రాక్‌లకు వీడ్కోలు పలికి బ్యాట్‌కు, బంతికి సమంగా పోరు జరిగేలా పిచ్‌లను రూపొందించాలనే డిమాండ్ వినబడుతోంది. ముంబై టెస్టు ముగిశాక మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మినహా మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌లలోనూ మన బ్యాటర్ల దృష్టి అంతా క్రీజులో నిలబడి పరుగులు సాధించడం మీద కాకుండా ఎప్పుడెప్పుడు పెవిలియన్‌కు వెళ్లిపోదామా? అన్నట్టుగా సాగింది. ఆరు ఇన్నింగ్స్‌లలో ‘మెన్ ఇన్ బ్లూ’ పతనాలే ఇందుకు తార్కాణం. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన మన వీరులు.. సాఫీగా సాగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఏడు వికెట్లను 54 పరుగులకే కోల్పోయారు.
ఒకదశలో 408/3 పటిష్ట స్థితి నుంచి 462 పరుగులకు ఆలౌట్ అయ్యారు. పుణె టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఆరుగురు చేసిన రన్స్ 53 కాగా సెకండ్ ఇన్నింగ్స్‌లో 50కే ఐదు వికెట్లు నేలకూలాయి. ముంబై టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 83 రన్స్‌కే వెనుదిరగగా రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులకే ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలా కొట్టిన పిండిల్లాంటి స్వదేశీ పిచ్‌లపై మన బ్యాటర్లు బొక్కాబోర్లా పడటం అభిమానుల ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి.