నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆదివారం అర్ధరాత్రి కొత్త చరిత్రకు (Women’s World Cup) నాంది పలికింది. దశాబ్దాల కలను నెరవేర్చుతూ యావత్ భారతవని ఉప్పొంగేలా ఆ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది 15 మందితో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టు (Team India). 47 ఏండ్ల నిరీక్షణ.. దశాబ్దాల ఒడిదొడుకులు.. గతంలో రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ‘కప్పు కల’కు తెరదించుతూ.. దక్షిణాఫ్రికా బ్యాటర్ డిక్లెర్క్ ఇచ్చిన క్యాచ్‌ను ఎక్స్ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకోవడంతో 150 కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ‘తామే ప్రపంచాన్ని జయించాం’ అన్నంత సంబురమది. నాలుగు దశాబ్దాలుగా అందకుండా ఊరించిన ఐసీసీ ట్రోఫీని సొంతగడ్డపై మన అమ్మాయిలు సగర్వంగా ముద్దాడిన సందర్భమది.. ఆ మధుర క్షణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
భారత పురుషుల జట్టుకు 1983 ఎలాగో.. అమ్మాయిలకు 2025 అలాంటిదన్న విశ్లేషణల్లో వీసమెత్తు సందేహమూ లేదు. కానీ ఈ ప్రయాణం సాఫీగా సాగలేదు. దీని వెనుక ఎన్నో ఏండ్ల ఛీత్కారాలు, ‘వీళ్లతో ఏమవుతుందిలే’ అన్న వెక్కిరింతలు.. అన్నింటికీ మించి ‘మహిళలన్న చిన్నచూపు’..
మొదలు ఇలా..
2025 కంటే చాలా ఏండ్ల కిందట.. నూట పదేండ్ల క్రితం నాటి ముచ్చట అది. 1913లో కేరళలోని కొట్టాయంలో గల ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్‌తో మొదలైంది భారత మహిళల క్రికెట్ ప్రయాణం! ఆస్ట్రేలియాకు చెందిన అన్నె కెల్లెవ్.. కొట్టాయంలోని బేకర్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న ప్రతి బాలిక తప్పనిసరిగా క్రికెట్ ఆడాలని నిబంధన పెట్టిందట.. కానీ ఆ సమయంలో ఆమె ఊహించి ఉండదు.. ఈ దేశంలో అమ్మాయిలు ఒకనాడు ప్రపంచాన్ని జయిస్తారని! బ్రిటీషర్లు వారసత్వంగా వదిలివెళ్లిన ఈ జెంటిల్మెన్ గేమ్‌కు మెన్స్ క్యాటగిరీలో బాలారిష్టాలు ఎదురైనా 1983 ప్రపంచకప్ విజయం దేశ క్రికెట్‌ను సమూలంగా మార్చేసింది. నాడు క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు దివంగత గాయని లతా మంగేష్కర్తో సంగీత విభావరి ఏర్పాటుచేసిన బీసీసీఐ నేడు ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా ఎదగడానికి ఆ విజయం ఎంతగానో దోహదపడింది. కానీ మహిళల క్రికెట్లో అలాంటి అద్భుతం జరగడానికి చాలా కాలమే వేచి చూడాల్సి వచ్చింది.
మనదేశంలో మహిళా క్రికెట్ ఊపిరి పోసుకుంది 1970ల్లో. బాంబే (ముంబై)కి చెందిన అలూ బమ్జీ తొట్ట తొలి క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటుచేసింది. దాని పేరు ‘ది అల్బీస్’. కానీ అధికారిక క్రికెట్ సంఘం ఏర్పడింది 1973 లక్నోలో. దాని పేరు ‘ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్ల్యూసీఏఐ). మహేంద్ర కుమార్ శర్మ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న ఆ సంఘానికి.. మూడేండ్ల పాటు క్రికెట్ మ్యాచ్‌లనే నిర్వహించలేదు. మహిళల ఇంటర్ స్టేట్ నేషనల్స్ (1973 పూణెలో) ఆడేందుకు మూడు జట్ల (ముంబై, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్)ను అతి బలవంతం మీద తయారుచేశారు. ఉత్తరప్రదేశ్ జట్టులో 11 మందీ ఆడలేని పరిస్థితి. కానీ కాలక్రమేణా ఆ సంఖ్య 8, 14కు చేరింది. డబ్ల్యూసీఏఐకి 1973లో అంతర్జాతీయ ఉమెన్స్ క్రికెట్ సంఘం (ఐడబ్ల్యూసీసీ) గుర్తింపు దక్కినా భారత ప్రభుత్వం గుర్తించింది 1978లోనే.. నాటికి బీసీసీఐ కూడా భారత మహిళా క్రికెట్ సంఘంతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగానే ఉండేది. భారత జట్టు అధికారికంగా టెస్టు మ్యాచ్ ఆడింది 1976 (వెస్టిండీస్‌తో)లో అయినా అంతకుముందే (1975లో) ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడినా వాటికి అధికారిక గుర్తింపు లేదు.
బీసీసీఐతో కలిశాక..
ఐసీసీ ఒత్తిడితో 2005లో ఎట్టకేలకు బీసీసీఐ.. మహిళల బోర్డును తమలో విలీనం చేసుకుంది. బీసీసీఐతో చేరినా మహిళా క్రికెట్లో అప్పటికప్పుడే అద్భుతాలు జరుగలేదు. వివక్ష కొనసాగినా హోటల్ గదులు, డార్మిటరీ, ప్రయాణ ఖర్చులను భరించడం, పర్యటనలకు గాను రైళ్లు, విమానాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు వంటి సౌకర్యాలు మెల్లిమెల్లిగా అమ్మాయిలకు సమకూరాయి. రెండేండ్ల తర్వాత (2008లో) అమ్మాయిలకు నేషనల్ క్రికెట్ అకాడమీలోకి వెళ్లి సదుపాయాలు పొందే అవకాశం వచ్చింది. బీసీసీఐతో మెర్జ్ అయ్యాకే అమ్మాయిలకు మ్యాచ్ ఫీజులూ (రూ. 2,500) అందాయి.

దిగ్గజాలు వేసిన బాటలో..
మహిళల క్రికెట్ ఉన్నతికి కృషి చేసినవారిలో ముఖ్యులుగా తొలి సారథి శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, సుధా షా, సంధ్య అగర్వాల్ వంటివారిని చెప్పుకోవచ్చు. ఆల్‌రౌండర్ అయిన శాంతా.. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం నమోదుచేసిన క్రీడాకారిణి. 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంధ్య.. 190 రన్స్ చేయడం అప్పట్లో సంచలనం. 1995-96లో న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టులో నీతూ డేవిడ్ (8/53) ఎనిమిది వికెట్ల ప్రదర్శన ఎంతో మంది యువ బౌలర్లకు స్ఫూర్తినిచ్చింది. వీళ్లు వేసిన బాటలోనే అంజుమ్, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి నిన్నటి తరం క్రికెటర్లు భారత క్రికెట్ ఉన్నతికి తమ వంతు సేవలందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి నేటి తరం క్రికెటర్లు వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళా క్రికెట్లో అపురూపమైన ఈ విజయంతో రాబోయే తరాలు క్రికెట్‌ను తమ కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహమే అక్కర్లేదు. 1983, 2011 పురుషుల క్రికెట్ విజయాలే ఇందుకు నిదర్శనం!బాలారిష్టాలు..
టెస్టు హోదా దక్కిన తర్వాత రెండేండ్లకు భారత జట్టు తొలి వన్డే (1978లో ఇంగ్లండ్‌తో) ఆడింది. యాధృచ్ఛికంగా అదే ఏడాది మనం ప్రపంచకప్‌నకూ ఆతిథ్యమిచ్చాం. నాడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో పాటు భారత్ పోటీలో నిలిచినా గ్రూప్ దశకే పరిమితమైంది. 1970ల నుంచి 90ల దాకా మహిళల జట్టు ఓ చిన్నపాటి యుద్ధమే చేసింది. స్పాన్సర్లు లేరు. వసతుల లేమి.. మ్యాచ్‌ల కోసం ప్లేయర్లే తమ జేబుల నుంచి నిధులు భరించాల్సిన దుస్థితి. డబ్ల్యూసీఏఐ వద్ద నిధుల్లేక భారత జట్టు ఆస్ట్రేలియాలో జరిగిన 1987 వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు వెళ్లలేదంటే నమ్ముతారా? 1997 వరల్డ్ కప్ భారత్‌లోనే నిర్వహించినా (మనం ఫైనల్ చేరలేదు) అప్పుడు పురుషుల వన్డే మ్యాచ్ (టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా) ఉండటంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌ను ఆదివారం నుంచి సోమవారానికి మార్చాల్సి వచ్చింది. 2005లో దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు నాటి మిథాలీ సేనకు బాలీవుడ్ నటి మందిరా బేడీ ఆర్థిక సాయంతో పాటు స్పాన్సర్లనూ తీసుకొచ్చిన విషయాన్ని మరువరాదు.
దూకుడు నేర్పిన డబ్ల్యూపీఎల్
భారత మహిళా క్రికెట్ ఎదుగుదలలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ది కీ రోల్ అని చెప్పక తప్పదు. 2023లో మొదలైన ఈ లీగ్.. మన అమ్మాయిలకు దూకుడు నేర్పించింది. అంతర్జాతీయ స్టార్లు ఈ లీగ్‌లో ఆడటం వల్ల వారి అనుభవం, ఆట పట్ల అవగాహన ఇక్కడి ఔత్సాహిక క్రికెటర్లకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పింది. ప్రస్తుతం జట్టులో ఉన్న అమన్‌జ్యోత్, రిచా ఘోష్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి వంటి యువ క్రికెటర్లు డబ్ల్యూపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే.