Women’s ODI World Cup | త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025 విజేతకు భారీ ప్రైజ్‌మనీ ఇవ్వనున్నుట్లు ఐసీసీ ప్రకటించింది. ఈసారి చాంపియన్‌గా నిలిచే జట్టుకు ఏకంగా 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.39.55కోట్లు) ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గత ఎడిషన్‌లో ప్రైజ్‌మనీ 1.32 మిలియన్ డాలర్లు (రూ.11.65కోట్లు) ప్రైజ్‌మనీ కంటే దాదాపు నాలుగు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ 13వ ఎడిషన్‌లో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 13.88 మిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు రూ.122.5కోట్లు). ఇది 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన చివరి ప్రపంచ కప్ (3.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 31 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ ప్రైజ్‌మనీ 2023 మెన్స్ ప్రపంచ కప్ (10 మిలియన్ డాలర్లు అంటే రూ. 88.26 కోట్లు) కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. 2023లో మెన్స్ వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు ఆస్ట్రేలియాకు రూ.33.31 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు రూ.16.65 కోట్లు దక్కాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత మొత్తం దీని కంటే చాలా ఎక్కువ. అయితే, ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ పెంచడం వెనుక ప్రధాన ఉద్దేశం వుమెన్స్ క్రికెట్‌కు సైతం ప్రజాదరణ కల్పించడంతో పాటు పరుషులతో పాటు సమానంగా గౌరవం ఇవ్వడమే.
ఈ సారి వుమెన్స్ వరల్డ్ కప్‌లో విజేత జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (రూ.39.55 కోట్లు) ఇవ్వనుండగా.. రన్నరప్‌గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (రూ.19.77 కోట్లు) ఇవ్వనుంది. ఇక సెమీఫైనల్లో ఓడిన పోయిన జట్లకు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (రూ.9.89 కోట్లు) ఇస్తారు. గ్రూప్ దశలో గెలిచిన జట్లకు ఒక్కో మ్యాచ్‌కు 34,314 డాలర్లు (రూ.30.29 లక్షలు).. ఐదు, 6వ స్థానాల్లో నిలిచే జట్లకు రూ.62లక్షల వరకు.. 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 24.71లక్షలు.. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు రూ. 22లక్షలు ఐసీసీ ఇవ్వనుంది. ఈ ఏడాది ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత్‌లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబయి, విశాఖపట్నం, శ్రీలంక కొలంబోలోని ఐదు వేదికల్లో జరుగుతాయి.
ఐసీసీ అధ్యక్షుడు జై షా ప్రైజ్‌మనీ పెంచడాన్ని మహిళల క్రికెట్ దిశగా ఓ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఈ ప్రకటన మహిళల క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని.. ప్రైజ్‌మనీ నాలుగు రెట్లు పెరుగడంతో క్రీడ దీర్ఘకాలిక వృద్ధికి తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా క్రికెటర్లు క్రికెట్‌ను వృత్తిగా కొనసాగించిన సమయంలో.. పురుషులతో సమాన గౌరవం, అవకాశాలు లభిస్తాయని నమ్మకంగా ఉండాలని ఐసీసీ సందేశం ఇస్తుందని స్పష్టం చేస్తుందన్నారు. ఈ మార్పు రాబోయే తరం మహిళా క్రీడాకారులు, అభిమానులకు స్ఫూర్తినిస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని ఐసీసీ పేర్కొంది.
Read Also :
Gold Rate Hike | ఆల్‌టైమ్ గరిష్ఠానికి బంగారం, వెండి ధరలు..! తులం ఏకంగా రూ.1.5లక్షలు..!