Gold Rate Hike | బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లో రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ధర పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. సెప్టెంబర్ ఒకటిన పసిడి, వెండి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. సోమవారం బంగారం రూ.2,404 పెరిగి తులం ధర రూ.1,04,792కి చేరుకుంది. మరోవైపు, వెండి ధర రూ.5,678 పెరిగి కిలోకు రూ.1,23,250కి పెరిగింది. సోమవారం బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం యూఎస్ డాలర్ బలహీనపడడం, సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించే అంచనాలు, ట్రంప్ సుంకాలకు సంబంధించిన అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. యూఎస్ సుంకాల కారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి దన్నుగా నిలుస్తున్నాయని.. ఈ క్రమంలో డిమాండ్ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది బంగారం తులానికి రూ.1.08లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ.1.30లక్షలు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,162 నుంచి రూ.1,04,792కి పెరిగింది. ఈ సమయంలో మొత్తం బంగారం ధర రూ.28,360 వరకు పెరిగింది. అదే సమయంలో వెండి కిలోకు రూ.86,017 నుంచి రూ.1,23,250కి చేరుకుంది. ఏకంగా రూ.37,233 ధర పెరిగింది. గతేడాది బంగారం రూ.12,810 పెరగడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,06,030 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,200 గా ఉన్నది. ఇక ముంబయి నగరంలో 24 క్యారెట్ల పుత్తడి రూ.1,05,880 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,050 వద్ద ట్రేడవుతుంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,880 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.97,050 వద్ద కొనసాగుతుంది.
వాస్తవానికి గతవారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ట్రంప్ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన సుంకాలను కోర్టు తప్పుపట్టింది. ట్రంప్ అధ్యక్ష అధికారులను దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు కోర్టు అక్టోబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ క్రమంలో డాలర్ బలహీనపడింది. పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రణాళిక, వాణిజ్య యుద్ధం భయం కారణంగా పెట్టుబడిదారులు బంగారం సురక్షితంగా ఉంటుందని భావించి కొనుగోలు చేస్తున్నారని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కూడా బంగారం పెరగడానికి కూడా మారడానికి ప్రధాన కారణం. మరో వైపు చైనా, రష్యా వంటి దేశాలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ కారణంగా మార్కెట్లో బంగారం డిమాండ్ పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోవడంతో అస్థిరత కారణంగా పెద్ద ఎత్తున బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.