Mary Kom: బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ యువ బాక్సర్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యువ బాక్సర్లు ఒక్క ఛాంపియన్షిప్ గెలవగానే దానితోనే సరిపెట్టుకుంటున్నారని, తానైతే నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ మరో రెండుమూడేండ్ల పాటు ఆడాలని అనుకుంటున్నానని తెలిపింది. తాను యువ బాక్సర్‌గా ఉన్నప్పటికంటే ఇప్పుడు దేశంలో బాక్సింగ్ క్రీడలో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, చాలా మంది మహిళలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘నేను ఇప్పటికీ సూపర్ ఫిట్‌గా ఉన్నాను. నేను ఇంకా చాలా సాధించాలనుకుంటున్నా. కానీ ప్రస్తుత జనరేషన్ మాత్రం అలా లేదు. వాళ్లు ఒక్క ఛాంపియన్షిప్ లేదా ఒక టోర్నీ గెలవగానే అక్కడికే సంతృప్తి పడుతున్నారు. ఒక్కసారి విజేతగా నిలవగానే ఎంతో సాధించామని భావిస్తున్నారు.. కానీ నేను మాత్రం అందుకు పూర్తి భిన్నం. వాళ్లు కూడా నాలాగే క్రీడా స్ఫూర్తి, ఆట పట్ల కసి ఉంటే దేశానికి మరిన్ని మెడల్స్ వస్తాయి…’అని చెప్పింది.
ఆరుసార్లు మహిళా ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన మేరీ కోమ్.. అంతర్జాతీయ నిబంధనల కారణంగా తాను ప్రపంచ ఛాంపియన్లలో పాల్గొనలేకపోతున్నానని, కానీ తాను మాత్రం రెండు మూడేండ్లు ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అంతేగాక.. ‘నా కఠోర శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. ప్రస్తుతం మన దేశంలో చాలా మంది మహిళలు బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా మంది నా అడుగుజాడల్లో నడుస్తున్నారు. నేను బాక్సింగ్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు (2001లో) మహిళల బాక్సింగ్ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సౌకర్యాలు మెరుగుపడ్డాయి…’ అని తెలిపింది.