Tilak Verma | పాక్, శ్రీలంక వేదిక జరిగే ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ఇటీవల అంతర్జాతీయ టీ20లో అరంగ్రేటం చేశాడు. తాజాగా వన్డే జట్టులోకి సైతం ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోను విడుదల చేసింది. తిలక్ వర్మ మాట్లాడుతూ ఆసియా కప్ జట్టులోకి నేరుగా సెలెక్ట్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. వెస్టిండిస్ పర్యటనలో తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున అరంగ్రేటం చేశాడు. ప్రస్తుతం బూమ్రా నేతృత్వంలోని టీమిండియా జట్టుతో కలిసి ఐర్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇప్పటి వరకు తిలక్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడి.. 34.8 సగటుతో 174 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ సైతం ఉన్నది.
బీసీసీఐ విడుదల చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ భారత్ తరఫున వన్డేలు ఆడాలని కలలు కన్నాను. కానీ, నేరుగా ఆసియా కప్‌కు ఎంపికవుతానని అనుకోలేదు. కొద్ది రోజుల కిందట టీ20లోకి అరంగ్రేటం చేసిన రోజుల్లోనే వన్డే జట్టుకు ఎంపికయ్యాను’ అని పేర్కొన్నాడు. మరో వైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తిలక్ వర్మ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ భాయ్ ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచాడని, తాను ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో క్రికెట్ గురించి తనతో మాట్లాడేవాడని, ఆటను ఆస్వాదించాలని, స్వేచ్ఛగా ఆడాలని సూచించాడని.. తాను అదే చేస్తున్నానని చెప్పాడు.
ఆసియా కప్‌కు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. తాను వన్డే క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నానని, దేశవాళీ స్థాయిలో లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడానని, రాష్ట్ర జట్టు తరఫున, అండర్-19 జట్టు తరఫున ఆడిన వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియాలో ఆడే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. వన్డేల్లోనూ భారత్ తరఫున సైతం పరుగులు చేయగలుగుతానని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా.. తిలక్ వర్మ ఎంపికతో నెంబర్ ఫోర్లో భారీగా పోటీ ఉండే అవకాశం ఉన్నది. నాలుగో నంబర్ బ్యాటింగ్‌కు తిలక్‌ను పంపాలని మాజీలు సూచిస్తున్నారు. అలాగే చాలాకాలంగా మిడిల్ ఆర్డర్లో ఎడమచేతి వాటం బ్యాటర్స్ లేరని, ఆ స్థానాన్ని తిలక్ భర్తీ చేస్తాడని పేర్కొంటున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బిమ్రా మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రముఖ కృష్ణ ఎంపిక కాగా.. సంజు శాంసన్‌ను బ్యాకప్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.