T20 World Cup 2024 : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. తొలిసారి మెగా టోర్నీలో ఆడుతున్న నేపాల్(Nepal)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు సందీప్ లమిచ్చానే(Sandeep Lamichhane)కు ఇంకా వీసా ఖరారు కాలేదు. అత్యాచార కేసులో ఈమధ్యే నిర్దోషిగా తేలిన అతడి వీసా విజ్ఞప్తిని అమెరికా అధికారులు పట్టించుకోలేదు.
అవును.. గురువారం ఖాట్మండ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం రేపిస్ట్ ముద్ర ఉన్న సందీప్ వీసాను నిరభ్యంతరంగా తోసిపుచ్చింది. దాంతో, వరల్డ్ కప్‌లో ఆడాలన్న సందీప్ కల కలగానే మిగిలేలా ఉంది. రెండోసారి సైతం సందీప్‌కి వీసా రాకపోవడంతో అతడి మద్ధతుదారులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తక్షణమే అతడికి వీసా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే సందీప్ వీసా విషయంలో అమెరికా ఎంబసీ అయిష్టంగానే ఉన్నట్టు సమాచారం.
ఒకవేళ వీసా రాకపోతో ఈ మాజీ సారథి మెగా టోర్నీకి దూరమవ్వడం ఖాయమనిస్తోంది. ఇప్పటికే నేపాల్ జట్టు అమెరికా చేరుకుంది. వామప్ మ్యాచ్‌లో కెనడా చేతిలో కంగుతిన్న ఆ జట్టు జూన్ 4న జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈసారి ప్రపంచ కప్ పోటీలకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 1 నుంచి 29 వరకు వరల్డ్ కప్ జరుగనుంది.
నేపాల్ జట్టు వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించడంలో లెగ్ స్పిన్నర్ అయిన సందీప్ కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. యూఏఈతో జరిగిన సెమీఫైనల్లో సందీప్ సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెగీ 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు.