Neeraj Chopra : భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పారిస్ డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చోప్రా.. స్వదేశంలో తన పేరుతో నిర్వహించిన ఎన్సీ క్లాసిక్ తొలి సీజన్లో విజేతగా అవతరించాడు. ప్రస్తుతం యూరప్‌లో శిక్షణకు సిద్దమవుతున్న వరల్డ్ బెస్ట్ జావెలిన్ త్రోయర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తన ఆటలో ఓ సమస్య ఉందని.. అదేంటో ఈమధ్యే తెలుసుకున్నానని చెప్పాడు చోప్రా.
‘నా గేమ్ పరంగా ఒక సమస్య ఉంది. ఈ ప్రాబ్లమ్ ఏంటనేది ఈమధ్యే తెలుసుకున్నా. అదేంటంటే.. ఈటెన్ బలంగా విసిరేసిన తర్వాత నేను తరచూ ఎడమ పక్కకు పడిపోతున్నా. అయితే.. శిక్షణ సమయంలో నేను అలా పడిపోవడం లేదు. కానీ, పోటీలోకి దిగాక మాత్రం బడిసెను శక్తికొద్ది దూరం విసిరిన తర్వాత నాకు తెలియకుండానే ఎడమ వైపు కూలబడుతున్నా. దీనికి కారణం నేను ఎక్కువ శక్తిని ఉపయోగించడమే కారణమని కోచ్ చెప్పాడు. అందుకే ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా చూసుకోవడంపై దృష్టి సారించాను’ అని చోప్రా వెల్లడించాడు.
ఈమధ్యే దోహా డైమండ్ లీగ్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్న చోప్రా అసాధ్యమన్నది లేదని చాటాడు. ఇదే అంశంపై స్పందించిన బడిసె వీరుడు ఏం అన్నాడంటే.. ‘నా కెరీర్లో మొదటిసారి 90 మీటర్ల దూరం విసిరాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ, ప్రతిసారి తొంభై మీటర్ల మార్క్ అందుకోవడంపై ఫోకస్ పెడుతున్నా. అయితే… నేను నిలకడగా 88-89 మీటర్ల దూరం చేరుకుంటున్నా. నా ప్రదర్శన పట్ల కోచ్ సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు.
నేను మరింత నిలకడగా రాణించాలని అనుకుంటున్నా. నా తదుపరి లక్ష్యం వరల్డ్ ఛాంపియన్షిప్స్ (World Championships). అక్కడ కచ్చితగా పతకం గెలవాలి. సో.. ఆ టోర్ని సన్నద్దతకు ఏ ఈవెంట్ పనికొస్తుందో కోచ్‌తో మాట్లాడాక తేల్చుకుంటాను’ అని చోప్రా వివరించాడు. టోక్యో వేదికగా సెప్టెంబర్‌లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ ప్రారంభం కానుంది. 13 నుంచి 21 తేదీ వరకూ జరుగబోయే ఈ మెగా టోర్నీ కోసం నీరజ్ చెక్ రిపబ్లిక్లో 57 రోజులు శిక్షణ తీసుకోనున్నాడు.