Neeraj Chopra : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. 90 మీటర్ల మార్క్ అందుకున్న జావెలిన్ స్టార్ ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ విజయంతో రికార్డు నెలకొల్పాడు. అంతటితోనే సంతృప్తి చెందకుండా తన తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడీ బడిసె వీరుడు. ఈసారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుపొందడమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నానని చెప్పాడు నీరజ్. మంగళవారం జరుగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెట్ సమావేశంలో నా అల్టిమేట్ గోల్‌ను నిర్ణయించుకుంటానని తెలిపాడీ ఛాంపియన్.
చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ జెలెంజీని కోచ్‌గా నియమించుకున్నా. ఆయనతో కలిసి నా ఆట, టెక్నిక్‌ను మరింత మెరుగపరచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మధ్యే 90 మీటర్ల దూరం ఈటెను విసిరాను. దాంతో, సీజన్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాను. చెక్ రిపబ్లిక్‌లోని నింబక్లో శిక్షణ సంతృప్తికరంగా సాగింది. ఈ సీజన్లో నా ప్రధాన లక్ష్యం సెప్టెంబర్‌లో టోక్యో వేదికగా జరుగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్స్. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవాలని భావిస్తున్నా అని నీరజ్ వెల్లడించాడు.
Happy Olympic Day! 🇮🇳
Together, #LetsMove and build a happier, healthier future. 💪 pic.twitter.com/q7935ObXoF
— Neeraj Chopra (@Neeraj_chopra1) June 23, 2025
రెండేళ్లకు ఓసారి జరిగే ఈ ఛాంపియన్షిప్స్ గత ఎడిషన్‌లో నీరజ్ స్వర్ణం గెలుపొందాడు. వరల్డ్ బెస్ట్ జావెలిన్ త్రోయర్‌గా పేరొందిన అతడు.. చిన్నప్పుడు ఉస్సేన్ బోల్ట్ (Usain Bolt) వీడియోలు తెగ చూసేవాడట. జమైకా పరుగుల చిరుత బోల్ట్‌ను చూసి అతడిలా అథ్లెటిక్స్‌లో రాణించాలని కలలు కన్నాడట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నీరజ్ ఏం అన్నాడంటే..
‘నేను చిన్నప్పుడు బోల్ట్‌కు పెద్ద ఫ్యాన్. అతడు అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన వీడియోల్ని ఆసక్తిగా చూసేవాడిని. గత ఏడాది నేను ఇక్కడకు వచ్చాను. కానీ, గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం నేను సూపర్ ఫామ్‌లో ఉన్నాను. అలా అనీ మరోసారి 90 మీటర్ల దూరం విసిరేందుకు మరింతగా శరీరాన్ని కష్టపెట్టాలనుకోవడం లేదు’ అని నీరజ్ వివరించాడు.