రామగిరి, జూన్ 23 : ఫ్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ డీఈఓ భిక్షపతికి సోమవారం సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల 14 ఫ్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వే చేయడం జరిగిందని, అయితే మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జేబీఎస్, పద్మనగర్‌లోని పాఠశాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మరుగుదోడ్లు, మూత్రశాలలు సరిపడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విదంగా కేసరాజుపల్లి, డీవీకే రోడ్డు, మర్రిగూడ ఉన్నత పాఠశాలలో భోజన శాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, అటెండర్స్, స్వీపర్స్ సహితం లేరన్నారు. వీటిలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి పేద విద్యార్థుల చదువుకు బాటలు వేయాలని కోరారు. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్స్తో భర్తీ చేయాలన్నారు. వినతి పత్రం అందచేసిన వారిలో పార్టీ జిల్లా, మండలాల నాయకులు ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కోట్ల అశోక్‌రెడ్డి, అద్దంకి నర్సింహ్మ ఉన్నారు.